గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:20 AM
మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు చేపట్టారు.
యువకుడిపై హత్యాయత్నం కేసు
వేపాడ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సింగరాయి గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్, కొరువాడ లక్ష్మణలు గత కొంతకాలం కిందట అండ మాన్ వెళ్లి, కూలి పనులు చేసుకుని జీవించేవారు. ఆ సమయంలో సాయికు మార్.. లక్ష్మణకు కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత లక్ష్మణ.. సాయికుమార్ కు చెప్పకుండా అండమాన్ నుంచి తన సొంత గ్రామమైన సింగరాయి వచ్చి, వేపాడలో సెలూన్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. కొన్నిరోజుల తర్వాత సాయికు మార్ కూడా అండమాన్ నుంచి స్వగ్రామానికి వచ్చేశాడు. ఈక్రమంలో సాయి కుమార్ బుధవారం వేపాడలో ఉన్న లక్ష్మణ సెలూన్ షాపునకు వచ్చి, ‘నేను నీకు అండమాన్‌లో ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి’ అని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో లక్ష్మణ.. సెలూన్‌లో బల్లపై ఉన్న గెడ్డం గీసే కత్తితో సాయికుమార్ గొంతుపై కోసేశాడు. విషయం తెలుసుకున్న వల్లంపూడి పోలీసులు అక్కడికి చేరుకుని, స్థానికుల సాయంతో సాయికుమార్‌ను 108 వాహనం ద్వారా ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సాయికుమార్‌కు చికిత్స అందిస్తున్నారు. సాయికుమార్ అందించిన సమాచారం మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ కేసు నమోదు చేశారు. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరాకుమార్ విజయనగరం ఆస్పత్రిలో ఉన్న సాయికుమార్ వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. అలాగే గురువారం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించారు.