Polamamba కరుణించు.. పోలమాంబ
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:18 PM
Have Mercy, Polamamba ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ నాలుగో వారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం చదురు, వనం గుడుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
శంబరకు పోటెత్తిన భక్తులు
మక్కువ రూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ నాలుగో వారం జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం చదురు, వనం గుడుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించిన అనంతరం పోలమాంబను దర్శించుకున్నారు. కొందరు గోముఖి నది తీరంలో పసుపు, కుంకమలు, చీరలు, కోళ్లతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించారు. ఇంకొందరు శంబర గ్రామ సమీపంలో వంటలు చేసుకుని కుటుంబాలతో కలిసి భోజనాలు చేశారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్ వద్ద భక్తులకు దేవాలయ సిబ్బంది తాగునీరు, ఉచిత ప్రసాదం అందించారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పార్వతీ పురం, బొబ్బిలి, సాలూరు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకట రమణ ఆధ్వర్యంలో 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎం.తేజోవతి తదితరులు అమ్మవారికి దర్శించుకుని పూజలు చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ చినతిరుపతి, ఈవో బి.శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.