Kharif ఖరీఫ్ గట్టెక్కినట్టేనా?
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:26 AM
Has the Kharif Season Weathered the Storm? తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కురిసిన తాజా వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్ రైతుల్లో ఆశలు చిగురించేలా చేశాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగైదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి.
నిండుకుండల్లా సాగునీటి వనరులు
ఖరీఫ్ పంటలపై రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
పాలకొండ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కురిసిన తాజా వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్ రైతుల్లో ఆశలు చిగురించేలా చేశాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగైదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి. మరోవైపు ఒడిశాలోని క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన వానలకు జిల్లాలో నదులు, చెరువులకు వరద పోటెత్తింది. వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించాయి. అయితే సాగునీటి వనరులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తుండడంతో ఖరీఫ్ పంటలకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు.
వరి సాగుకు ప్రయోజనం..
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక.. ఈ ఏడాది ఖరీఫ్ రైతులు నాట్లు వేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. వాతావరణం అనుకూలించకపోవడం, సాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. కొన్నిచోట్ల సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని తెచ్చి.. నారుకు తడి అందించారు. మరికొన్ని చోట్ల జూలైలో వేయాల్సిన నాట్లును ఈ నెల 20వరకు వేశారు. వాస్తవంగా జిల్లాలో ఈ ఏడాది 75 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా, నిన్న మొన్నటి వరకు సాగునీటి కష్టాలు ఎదుర్కొని 72 వేల హెక్టార్లలో అన్నదాత నాట్లు వేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో మిగిలిన రైతులు కూడా వరినాట్లు పూర్తి చేస్తున్నారు.
ఎండిన పంటలకు ఊపిరి..
జిల్లాలో 80 శాతం కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వీరంతా ఖరీఫ్‌లో ప్రధానంగా వరినే సాగు చేస్తుంటారు. ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో అన్నదాతలు ఎద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. అయితే సరైన వర్షాలు లేక పంట ఎండిపోయింది. ఈ స్థితిలో పంటలకు తాజా వర్షాలు ఊరిపిపోసినట్టు అయింది. ప్రస్తుతం 40 వేల హెక్టార్లకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. ఆలస్యంగా కురిసిన వర్షాలు.. ప్రధాన పంట వరికి ఎంతగానో ఉపకరిస్తాయని రైతులు చెబుతున్నారు.
పెరిగిన భూగర్భజలాలు
నిన్నమొన్నటి వరకు తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు నుంచి పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందేది కాదు. ఎకరం పొలానికి నీరందించేందుకు నాలుగు గంటల సమయం పట్టేంది. అయితే తాజా వర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో రెండు గంటల్లోనే బోర్లు ద్వారా ఎకరం వరి పంటకు సాగునీరు అందుతుందని రైతులు తెలియజేస్తున్నారు.
చిరు ధాన్యాల సాగుపై ఆసక్తి...
ఎల్‌నినో ప్రభావంతో కొంతమంది రైతులు ఇప్పటివరకు సాగు చేపట్టలేకపోయారు. అయితే ప్రస్తుం సాగునీరు అందుబాటులోకి రావడంతో భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్టోబరు చివరి నాటికి దుక్కులను పూర్తి చేసుకుని.. రబీ కింద వేసే మినుము, పెసర, ఉలవ, కట్టెజనుము, రాగులతో పాటు ఇతర చిరు ధాన్యాల పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ పంట చివరి దశలో ఉన్న సమయంలో వ్యవసాయశాఖ సబ్సిడీ ద్వారా అందించే ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకుని సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మెట్ట ప్రాంతంలో రైతులు చిరుధాన్యాల సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబరు చివరిలో వేసినా డిసెంబరు చివరి నాటికి పంట చేతికొచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎరువుల కొనుగోలు..
ప్రస్తుతం సాగునీరు అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ఎరువుల కొనుగోలు ఊపందుకున్నాయి. ఖరీఫ్ కింద వేసిన వరితో పాటు మొక్కజొన్న, పత్తి, ఇతర వాణిజ్యపంటలకు అవసరమైన ఎరువులను రైతులు ముమ్మరంగా కొనుగోలు చేస్తున్నారు.
సూచనలు అందించే వారేరీ?
ఆలస్యంగా వేసిన నాట్లుతో పాటు రైతులను వేధిస్తున్న చీడపీడల నుంచి పంటల రక్షణ కు వ్యవసాయశాఖ సూచనలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ఆ శాఖాధికారులు అప్రమత్తమై క్షే త్రస్థాయిలో పర్యటించి.. రైతులకు సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. మొక్కుబడిగా వ్యవహరిస్తే ఖరీఫ్ రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు క్షేస్ర్థాయిలో వ్యవసాయ యంత్రాంగం సూచనలు అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
పంటలకు ఊపిరి
తుఫాన్ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు వరంగా మారాయి. అసలు ఈ ఏడాది సరైన వర్షాలు లేక సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నాం. పంటలను దక్కించుకోవడం ఎలా తెలియక నానా తంటాలు పడ్డాం. ఈ తరుణంలో కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి.
- కెల్ల అప్పలనాయుడు, రైతు, పాలకొండ
=============================
వరుణుడు కరుణించాడు..
ఈ ఏడాది ఖరీఫ్ మొదటిలో వర్షాలు లేక అష్టకష్టాలు పడి వరి పంట వేశాం. అయితే పంట ఎలా కాపాడాలో తెలియక చూస్తున్న సమయంలో వరుణుడు కరుణించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది.
- దుప్పాడ నరసింహమూర్తి, రైతు పాలకొండ
=============================
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పెరుగుదల దశలో వరి పంట ముంపునకు గురైతే పొలం నుంచి నీరు మళ్లించాలి. పాముపొడ తెగులు నివారణకు క్రోపీకోనాజోల్ ఒక మిల్లీమీటర్లు లేక వాలిడామైసన్ రెండుమిల్లీ లీటర్ల లీటరు నీటిలో కలిపి దుక్కుకు తగిలేలా 15 రోజులకు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్న, పత్తి పొలాల్లో నీరు లేకుండా చూడాలి. అవసరమైన ద్రావణం పిచికారీ చేయాలి. సాగునీటిని పంటలకు వినియోగించుకోవాలి.
- భవానీశంకర్, జిల్లా వ్యవసాయాధికారి