Share News

Hospital ఆసుపత్రిలో అవస్థలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:34 AM

Hardships in the Hospital కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులు, వైద్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని 50 పడకలతో సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేశారు. అందుకు తగ్గట్టుగా వైద్యు లను నియమించారు. అయితే అదనపు గదులు లేకపోడంతో ఇక్కట్లు తప్పడం లేదు.

  Hospital ఆసుపత్రిలో అవస్థలు
కురుపాం ఆసుపత్రి ముందు బారులుతీరిన రోగులు, గర్భిణులు

  • రోజురోజుకూ పెరుగుతున్న ఓపీ

  • గదులు లేక రోగులు, వైద్యులకు తప్పని ఇబ్బందులు

  • ప్రారంభానికి నోచని అదనపు భవనం

కురుపాం,మార్చి27(ఆంధ్ర‌జ్యోతి): కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులు, వైద్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని 50 పడకలతో సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేశారు. అందుకు తగ్గట్టుగా వైద్యు లను నియమించారు. అయితే అదనపు గదులు లేకపోడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం డాక్టర్లందరూ ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తోంది. మరో గదిలో రోగులందరికీ వైద్యపరీక్షలు చేయాల్సి వస్తోంది.

వాస్తవంగా కురుపాం సీహెచ్‌సీకి రోజుకు సుమారు రెండు వందలకు పైబడి రోగులు వస్తుం టారు. సోమ, గురువారాల్లో అయితే ఆసుపత్రి కిటకిటలాడుతుంది. అదే సీజనల్‌లో అయితే ఈ సంఖ్య రెట్టింపవుతుంది. కాగా ఆసుపత్రిలోని ఒక వార్డులో పది బెడ్‌లు మాత్రమే ఉండగా.. వరండాలో మరో పది బెడ్స్‌ వేసి ఇన్‌పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే రోగుల తాకిడి ఎక్కువైతే ఇంక అంతే సంగతి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురేసి రోగులు సర్దుకోవాల్సిన దుస్థితి. గతంలో సీహెచ్‌సీ అదనపు భవన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినా.. నేటికీ అది అందుబాటులోకి రాలేదు. రెండేళ్ల కిందటే 90 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు చెల్లింపులు కాకపోవడంతో కాంట్రాక్టర్‌ మిగిలిన పనులు చేయకుండా చేతులెత్తేశారు. అయితే ఈ విషయం ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి రావడంతో ఉపాధి హామీ నిధులతో కొంతవరకు కాలువ పనులు చేయించారు. భవన నిర్మాణం కూడా వెంటనే పూర్తి చేయాలని ఇంజనీంగ్‌ అధికారులను ఆదేశించారు. మొత్తంగా అదనపు భవన నిర్మాణం పూర్తికాక.. సీహెచ్‌సీలో వైద్య సిబ్బంది, రోగులకు అవస్థలు తప్పడం లేదు. తక్షణమే పనులు పూర్తిచేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

గదులు లేక ఇబ్బందులు

ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని విభాగాలకూ ఎనిమిది మంది వైద్యులు ఉన్నారు. డీసీహెచ్‌, జనరల్‌ సర్జన్‌, అప్తాలమిస్ట్‌, ఇద్దరు ఎంబీబీఎస్‌ డాక్టర్లను నియమించాల్సి ఉంది. గదులు లేకపోవడంతో ఇబ్బందలు పడుతున్నాం. రోజూ 150 నుంచి 200 వరకు ఓపీ ఉంటుంది. సీజనల్‌లో అయితే రోగుల తాకిడి రెట్టింపవుతుంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు నెలల్లో నూతన అదనపు భవనం ప్రారంభిస్తే అందరి ఇక్కట్లు తీరుతాయి.

- కె.సందీప్‌ కుమార్‌, సీహెచ్‌సీ వైద్యాధికారి

Updated Date - Mar 28 , 2026 | 12:34 AM