Share News

Unending Agony కష్టం వృథా.. తీరని వ్యధ

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:53 PM

Hard Work in Vain… Unending Agony టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నడూ చూడని విధంగా నష్టాలు చవిచూస్తున్నారు. ధర అమాంతం పడిపోవడంతో కన్నీరుము న్నీరవుతున్నారు. పంట విక్రయానికి అష్టకష్టాలు పడుతున్నారు.

  Unending Agony కష్టం వృథా.. తీరని వ్యధ
దుగ్ధసాగరంలో పొలంలోనే టమాటా పంటను విడిచిపెట్టిన రైతు

  • కన్నీరుపెడుతున్న రైతులు

  • పొలాల్లోనే వదిలేస్తున్న వైనం

  • పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన

  • ఆదుకోవాలని వేడుకోలు

సాలూరు, మార్చి3(ఆంధ్రజ్యోతి): టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నడూ చూడని విధంగా నష్టాలు చవిచూస్తున్నారు. ధర అమాంతం పడిపోవడంతో కన్నీరుము న్నీరవుతున్నారు. పంట విక్రయానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర లేక.. నిల్వ చేసుకునే సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీ రూపాయికి కూడా కొనేనాథుడే లేకపోవడంతో కొందరు పంట పొలాల్లోనే పంటను విడిచి పెడుతున్నారు.

ఇదీ పరిస్థితి...

- సాలూరు నియోజకవర్గంలో ఏటా సుమారు 250 ఎకరాల్లో టామాటా సాగవుతుంది. సాలూరుతో పాటు దుగ్ధసాగరం, చినబోరబంద, పెదబొరబంద గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఈ సాగు చేపడుతుంటారు. పాచిపెంట మండలం మోసూరు, గురువునాయుడుపేట, మాతుమూరు, తాడూరు తదితర గ్రామాల్లో ఈ సాగు చేస్తున్నారు. అయితే ఏటాలానే ఈ సారి కూడా వారు టామాటా పంట వేశారు. కాగా చేతికందే సమయానికి సీన్‌ మారింది. గత నెల వరకూ కేజీ రూ.40 వరకూ ఉన్న ధర నేడు పూర్తిగా పడిపోయింది. దిగుబడులు పెరగడంతో కేజీ రూపాయికి కూడా ఎవరూ కొనడం లేదు. దీంతో రైతులు మార్కెట్లో టామాటాను విక్రయించడానికి రోజంతా నిరీక్షించాల్సి వస్తోంది.

- సాలూరు రూరల్‌: ప్రస్తుతం సాలూరులో 30 కిలోల ఉన్న కేట్‌ కేవలం 60 రూపాయలకే అమ్ముడవుతోంది. ఈ కేట్‌ ధర ఉదయం పది గంటల లోపు రూ. 80 రూపాయల వరకు పలి కింది. పది గంటల తరువాత ఈ ధర రూ. 60లకు పడిపోయింది. పొలంలో టమాటా సేకరణకు రూ. 300 కూలీ ఇస్తారు. అయితే వారు సేకరించిన టమాటాలను ఆటోలో కేట్‌కు రూ. 20 చొప్పున ఇచ్చి సాలూరు మార్కెట్‌కు తరలిస్తారు. కాగా రవాణా, కూలీల డబ్బులు సైతం రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఎకరా సాగుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టామని.. ప్రస్తుతం ధర లేకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటను నిల్వ ఉంచేందుకు మార్గాలు లేక పూర్తిగా పాడైపోతోందన్నారు. పొలాల్లో పంటను విడిచిపెడుతుంటే గుండె బరువెక్కుతోందని వాపోతున్నారు. గతంలో ధర తగ్గినప్పుడు ఏఎంసీ అధికారులు టమా టాను కొనుగోలు చేసేవారు. విజయనగరం, విశాఖపట్నం రైతు బజారులకు తరలించి రైతులకు మేలు చేసేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఏఎంసీ చైర్మన్‌ ముఖి సూర్యానారాయణను వివరణ కోరగా.. ‘ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. ఒకట్రెండు రోజుల్లో రైతుల నుంచి టమాటాను కొనుగోలు చేసి రైతుబజార్లకు తరలించేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

ఆదుకోవాలి..

పంట చేతికి వచ్చే నాటికి టమాటా ధర పూర్తిగా పతనమైంది. పంటను అమ్ముకోలేక.. నిల్వ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొనేవారు లేకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేస్తున్నాం. అధికారులే ఆదుకోవాలి.

- ఎక్కుడు తిరుపతి, దుగ్ధ సాగరం

================================

బాధనిపిస్తోంది

కుటుంబసభ్యులమంతా ఎంతో కష్టపడి టమాటాను పండించాం. అయితే ప్రస్తుతం ధర లేదు. పంటను పొలాల్లోనే ఉంచేస్తుంటే.. చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు.

- మంచాల కల్యాణి, దుగ్ధసాగరం

Updated Date - Mar 03 , 2026 | 11:53 PM