గిరిజనులను ఇబ్బంది పెడితే సహించేదిలేదు
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:19 AM
గిరిజనులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): గిరిజనులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం దండిగాం రోడ్డు నుంచి నేరెళ్లవలస గ్రామానికి సుమారు రూ.1.90 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. అందులో సుమారు రూ.500 కోట్లతో సాలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. నేరెళ్లవలసలో నిర్వహించిన సమావేశానికి అధికసంఖ్యలో గిరిజనులు హాజరు కావడంతో ఆమె గిరిజనులను, నాయకులనుు అభినందించారు. నియోజకవర్గంలోని 21 కొఠియా గ్రామాల గిరిజనులను ఒడిశా ప్రభుత్వం గానీ, అక్కడ పోలీసులు గానీ ఇబ్బంది పెడితే క్షమించే ప్రసక్తే లేదన్నారు. 21 గ్రామాల అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉందన్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి ఏ ప్రభుత్వమైనా పాటుపడాలే గానీ వారి పతనానికి చూస్తే సహించనన్నారు. దిగువశెంబి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అకారణంగా అరెస్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి 24 గంటల్లోనే వారిని విడిపించడం జరిగిందన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి సమావేశానికి ఒడిశా పత్రికా విలేకరులు, ఒడిశా అధికారులు, పోలీసులు హాజరుకావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రూరల్ సీఐ రామకృష్ణతో మాట్లాడుతూ ఎలా సమావేశానికి వారిని అనుమతించారని ప్రశ్నించారు. సమావేశానికి వచ్చినా గిరిజనులకు అండగా అనుకూలంగా ఉంటే తనకు అభ్యంతరం లేదని, గిరిజనులకు ఇబ్బందులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.
సారిక, తోణాం, కురుకుట్టి, గంజాయిభద్ర పంచాయతీల పరిధిలోని సుమారు 560 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆమె సాదరంగా ఆహ్వానిం చారు. కమండల పార్టీ అధ్యక్షుడు ఆముదాల పరమేశు తదితరులు పాల్గొన్నారు.