happy ugadi సందడిగా ఉగాది
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:21 AM
happy ugadi ఉగాదిని జిల్లా ప్రజలు సందడిగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఉదయానే ఉగాది పచ్చడిని స్వీకరించి ఆలయాలకు వెళ్లారు. ఆపై పంచంగ శ్రవణాన్ని విని ఈ ఏడాదిలో తమ భవిష్యత్‌ను అంచనా వేసుకున్నారు.
సందడిగా ఉగాది
సంప్రదాయ వస్త్రధారణలో మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ
మన సాంస్కృతిని భావితరాలకు అందించాలి: మంత్రి శ్రీనివాస్
విజయనగరం రూరల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉగాదిని జిల్లా ప్రజలు సందడిగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఉదయానే ఉగాది పచ్చడిని స్వీకరించి ఆలయాలకు వెళ్లారు. ఆపై పంచంగ శ్రవణాన్ని విని ఈ ఏడాదిలో తమ భవిష్యత్‌ను అంచనా వేసుకున్నారు. కాగా పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయనగరం కొత్తపేటలోని మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో గురువారం అధికారిక జిల్లా స్థాయి ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ హాజరయ్యారు. వీరికి దేవదాయశాఖ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పంచాంగకర్త వారణాసి వెంకట నారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం చేసి ఈ ఏడాదిలో ప్రపంచ, దేశ, రాష్ట్ర పరిస్థితులు, రాశి ఫలాలు, వర్షాలు, వ్యవసాయం, వివిధ రంగాల్లో వచ్చే మార్పులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ప్రజలకు వెలుగుల పండుగ అని చెప్పారు. తెలుగుభాష, సాంస్కృతిని భావితరాలకు అందించాలని, మన సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలన్నారు. పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం ప్రతి రంగంలో అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో వృద్ధి సాధించాలన్నారు. సకాలంలో వర్షాలు కురవాలని.. కర్షకులు, కార్మికులు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆర్థికంగా, కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఉగాదిని పురస్కరించుకుని వేద పండితులు యర్రమిల్లి ప్రసాద్ శర్మ, అర్చకులు ఆరవిల్లి నరసింహమూర్తి, జయంతి వెంకట దుర్గా కామేశ్వర విశ్వనాథ్, వెలువలి నరసింగరావు తదితరులు పండిత సత్కారం చేశారు. మహారాజా సంగీత కళాశాల విద్యార్థినులు ఆలాపన చేసిన సంగీత కృతులు, ప్రార్థన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆహుతులందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, ఆర్‌డీవో వెంకటేశ్వరరావు, దేవదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష, సీపీవో బాలాజీ, జిల్లా పర్యాటకశాఖాధికారి లక్ష్మీనారాయణ, వ్యవసాయశాఖాధికారి తారకరామారావు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.