Share News

happy pungal ఊరు వాడా సంర‘కాంతులు’

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:59 PM

happy pungal సంక్రాంతి కళ తొణికిసలాడుతోంది. పల్లెలు కొంగొత్తగా తయారయ్యాయి. చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది.

happy pungal ఊరు వాడా సంర‘కాంతులు’

ఊరు వాడా సంర‘కాంతులు’

పల్లెల్లో సందడే సందడి

కొత్త దుస్తుల్లో యువత, చిన్నారుల కేరింత

పోటాపోటీగా ముగ్గుల పోటీలు

అందంగా ముస్తాబైన ముంగిళ్లు

డూడూ బసవన్నల సందడి

ఉత్సాహంగా భోగి మంటలు

నేడే అసలు పండగ మకర సంక్రాంతి

సంక్రాంతి కళ తొణికిసలాడుతోంది. పల్లెలు కొంగొత్తగా తయారయ్యాయి. చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది. చిన్నారులు సందడి చేస్తున్నారు. యువకులు ఆటలు, పాటలతో ఆకట్టుకుంటున్నారు. గాలిపటాలు ఎగరేస్తున్నారు. యువతులు ముంగిళ్లకు రంగురంగుల రంగవల్లులతో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి సంప్రదాయాలను అనుసరించారు. మరోవైపు సంక్రాంతి చుట్టాలుగా ప్రతి ఇంటికీ వచ్చే హరిదాసులు, డూడూ బసవన్నల హడావిడి అంతా ఇంతా కాదు. వీరిని అందరూ అనుసరిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. ఇక అసలు పండుగకు వేళ అయింది. అందరూ ఎదురుచూస్తున్న మకర సంక్రాంతిని గురువారం వైభవంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. పెద్దలను పూజించి ఆపై కొత్త దుస్తులతో ముస్తాబవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాగా బుధవారం కూడా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడాయి. త్వరగా స్వగ్రామాలకు చేరుకో వాలన్న ఉత్సాహం ప్రయాణికుల్లో కనిపించింది. పండుగకు కావాల్సిన పిండివంటల సామగ్రి, పూజా సామాన్ల కొనుగోలుతో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. దుస్తుల షాపులది మరింత ప్రత్యేకం.

కోడి పందేలు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా పందేలు జరిగే స్థలం నిర్ణయించుకుంటున్నారు. పందేలకు దిగేవారు తప్పితే ఇతరులకు ఈ సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టారు. డ్రోన్‌లతోనూ పర్యవేక్షిస్తున్నారు.

వైభవంగా భోగి

జిల్లా వ్యాప్తంగా భోగి పండగ బుధవారం వైభవంగా జరిగింది. చిన్నలు, పెద్దలు కలిసి సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పూజ చేసి శ్రీకారం చుట్టారు. ఆవు, గేదె పేడతో తయారు చేసిన పిడకలను వేయడం కనిపించింది. కట్టెలు, పిడకలతో పాటు ఇళ్లలోని పాత మంచాలు, విరిగిన కుర్చీలను భోగిలో వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా గోదాదేవి కల్యాణం నిర్వహించారు. చిన్నారులకు సూర్యాస్తమయం లోపు భోగి పండ్లు వేశారు. వారిని సంప్రదాయ దుస్తులతో ముస్తాబు చేశారు.

విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భోగి మంట చెంత స్పీకర్లు పెట్టి పాటలకు యువత లయబద్ధంగా నృత్యాలు చేశారు. అపార్టుమెంట్‌ల వద్ద కూడా సందడి వాతావరణం ప్రస్ఫుటమైంది.

Updated Date - Jan 14 , 2026 | 11:59 PM