Share News

happy for start airport services అంబరాన ఆనందం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:20 AM

happy for start airport services

happy for start airport services అంబరాన ఆనందం
భోగాపురం ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఇండిగో విమానం

అంబరాన ఆనందం

భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం

తొలిరోజు సందడే సందడి

ఉదయం 6-45 గంటలకు తొలి విమానం ల్యాండింగ్‌

హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానం రాక

స్వాగతం పలికిన కేంద్ర మంత్రి, కలెక్టర్‌

విజయనగరం/భోగాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్‌ అయిన వేళ ప్రజలు, నాయకులు, అధికారులు, ప్రయాణికుల ఆనందం అంబరాన్ని తాకింది. విమానం వస్తుండగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచే స్వాగతం పలికారు. విమానాశ్రయంలో వెల్‌కమ్‌ చెప్పేందుకు అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. వెల్‌కమ్‌ టు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అని ప్రకటన రాగానే ఉద్వేగానికి గురయ్యారు. కొన్ని క్షణాల పాటు మధురానుభూతి పొందారు. సోమవారం ఉదయం 6-45 గంటలకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన తొలి విమానం ఇండిగో ల్యాండింగ్‌ అయ్యాక విమానాశ్రయంలో వినిపించిన మాటతో ప్రయాణికులు పులకించిపోయారు. ఈ పరిణామంతో ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తొలుత ఇక్కడి నుంచి స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సింగపూర్‌ బయలుదేరింది. కానీ ల్యాండ్‌ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందినది. సరిగ్గా సోమవారం ఉదయం 6.45 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన ఇండిగో విమానానికి జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను బహుమతులుగా అందజేశారు. ఫస్ట్‌ ఫ్లైట్‌ ధ్రువీకరణ పత్రాలు, బోర్డింగ్‌ పాసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అందించారు.

నూతన చరిత్ర ఆవిష్కృతమైన రోజు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఉత్తరాంధ్రలో ఆగస్టు 17వ తేదీ నూతన చరిత్ర ఆవిష్కృతమైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. భూములు ఇచ్చిన రైతన్నలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

53 కిలోమీటర్లు స్కేటింగే చేస్తూ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిలకించేందుకు శ్రీకాకుళానికి చెందిన చిన్నారులు ఎన్‌.అయ్యాన్‌, ఎ.ప్రకుల్‌లు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సుమారు 53 కిలోమీటర్లు స్కేటింగ్‌ చేసుకుంటూ వచ్చారు. ఒక చేత్తో జాతీయ జెండాను పట్టుకుని స్కేటింగ్‌ చేశారు. ఎయిర్‌పోర్టును తిలకించేందుకు ఈవిధంగా రావడం చాలా ఆనందంగా ఉందని కోచ్‌ ఎస్‌పీనరిశింహమూర్తి తెలిపారు.

తిరుపతి నుంచి భోగాపురానికి కలిశెట్టి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమైన రోజును పురస్కరించుకుని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ ఆనందం ఉత్తరాంధ్ర ప్రజలందరిది అని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖద్వారం

ఎమ్మెల్యే నాగమాధవి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖద్వారం భోగాపురం(అల్లూరి సీతారామరాజు) ఎయిర్‌పోర్టు అని ఎమ్మెల్యే నాగమాధవి అన్నారు. సోమవారం మొదలైన శాసనసభలో సమావేశాల్లో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిర్‌పోర్టులో విమానరాకపోకల ప్రారంభంతో అభివృద్ధి కూడా ఆరంభం అవుతుందన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:20 AM