Share News

Haphazardly..! అడ్డగోలుగా..!

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:52 PM

Haphazardly..! జిల్లాలో మున్సిపాల్టీలు, నగర పంచా యతీలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనధికార లేఅవుట్లలో సైతం యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు.

Haphazardly..! అడ్డగోలుగా..!
నోటీసులు అందుకున్న పార్వతీపురం బైపాస్‌ రోడ్‌లో ఓ వాణిజ్య సముదాయం

  • అనుమతుల్లేకుండా కట్టడాలు.. అయినా ఆపేవారేరీ?

  • రెసిడెన్షియల్‌ భవన సముదాలను అద్దెలకు ఇస్తున్న వైనం

  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

  • నోటీసులతోనే సరిపెడుతున్న సిబ్బంది

  • వారి తీరుపై విమర్శల వెల్లువ

పార్వతీపురం టౌన్‌, జూన్‌5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాల్టీలు, నగర పంచా యతీలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనధికార లేఅవుట్లలో సైతం యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొన్నిచోట్ల రెసిడెన్షియల్‌ అనుమతులతో నిర్మించిన భవన సముదాలను అద్దెలకు ఇస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. మరికొన్నిచోట్ల టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సెక్రటరీలు, లైసెన్డ్‌ సర్వేయర్ల హవా కొనసాగుతోంది. గృహాలు, భవన సముదాయాలు ఏవైనా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో స్థానికంగా ఉండే సచివాలయ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది మధ్యవర్తులుగా ఉంటూ అనుమతులు మంజూరు చేస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాకేంద్రంలో ఇలా..

- జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో జోరుగా అక్రమణ నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువుల్లో, చెరువు గట్లుపైనా, సాగు భూముల్లో, రెవెన్యూ అధికారులు అనుమతులు లేని అనధి కారిక లే అవుట్లలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. అయితే వాటికి నోటీసులు జారీ చేశామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నా.. కట్టడాలు మాత్రం ఆగడం లేదు.

- పట్టణ నడిబొడ్డున ఉన్న సౌందర్య ఽథియేటర్‌ రోడ్డు వీధితో పాటు బెలగాంలోని ఓ ప్రైవేట్‌ కళాశాల సమీపంలో, కొత్తవలస తదితర ప్రాంతాల్లో అధికారికం అంటూనే అనధికారిక లేవుటల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.

- పట్టణంలో 38 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయాలని గత కొన్నేళ్లుగా సం బంధింత యజమానులు కోరుతున్నారు. అయితే వాటిల్లో ఎన్ని లే అవుట్లకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అప్రూవల్‌ ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాకుండా పట్టణం లోని ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టిం చుకోకపోడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- దీనిపై టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారి నారాయణను వివరణ కోరగా.. అనధికారిక లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చామన్నారు. ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా పట్టణంలో ఎక్కడైనా భవన నిర్మాణాలు చేపడితే వాటిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

సాలూరు మున్సిపాల్టీలో..

సాలూరు: సాలూరు మున్సిపాలిటీ పరిధిలోనూ ఎక్కడికక్కడే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నా.. ప్రశ్నించేవారే కరువయ్యారు. కొన్నేళ్ల కిందట రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకుని మున్సిపల్‌ కార్యాలయానికి సమీపంలో ఓ బహుళ అంతస్తు భవన సముదాయం నిర్మించారు. అయితే కమర్షియల్‌గా ఆ భవన సముదా యాన్ని అద్దెలకు ఇచ్చి రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. సదరు యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా ఓ బ్యాంకు ఏటీఎంను కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ ప్లేస్‌ లేకుండా చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఆ భవన సము దాయంలో అద్దెకున్న వారితో పాటు అక్కడి వచ్చిపోయే వారంతా తమ బైక్‌లను మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పెడుతున్నా.. అధికారులు స్పందించక పోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌ను వివరణ కోరగా ‘మున్సిపల్‌ కార్యా లయ ఆవరణలో ఎలాంటి ప్రైవేట్‌ వాహనాలు నిలిపేందుకు అనుమతులు లేవు. ప్రైవేట్‌ భవన సముదాయంలో ఏటీఎం కేంద్రం ఏర్పాటు, పార్కింగ్‌ స్థలం లేకపోవడాన్ని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 11:52 PM