Share News

Roads! చేయి చేయి కలిపి.. రహదారిని బాగుచేసుకుని!

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:18 AM

Hand in Hand, Let’s Build Better Roads! జరడ ఘాట్‌ రోడ్డును గిరిజన గ్రామస్థులు బాగు చేసుకుంటున్నారు. సుమారు ఐదు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఐదు రోజులుగా శ్రమదానం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు శ్రమించి రహదారిని మెరుగు పరుస్తామని వారు చెబుతున్నారు.

 Roads! చేయి చేయి కలిపి..  రహదారిని బాగుచేసుకుని!
రోడ్డు పనులు చేసుకుంటున్న గిరిజన గ్రామస్థులు

  • ఐదు రోజులుగా శ్రమదానం

  • గతంలో నిరసన ప్రదర్శనలు చేపట్టినా.. స్పందించని అధికారులు

కురుపాం రూరల్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జరడ ఘాట్‌ రోడ్డును గిరిజన గ్రామస్థులు బాగు చేసుకుంటున్నారు. సుమారు ఐదు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఐదు రోజులుగా శ్రమదానం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు శ్రమించి రహదారిని మెరుగు పరుస్తామని వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నీలకంఠాపురం-జరడ మధ్య తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు బాగుచేయాలంటూ 20 గిరిజన గ్రామాల ప్రజలు దశాబ్దకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాళ్లు తేలిన రోడ్డుపై ఇటీవల జరడ గ్రామస్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అయినా ఎటువంటి చర్యల్లేవు. వాస్తవంగా నీలకంఠాపురం- జరడ తొమ్మిది కిలోమీటర్ల రహదారిలో నాలుగు కిలోమీటర్ల వరకూ మినీ ఘాట్‌ రోడ్డు ఉంది. మిలిగిన 5 కిలోమీటర్లలో హెవీ ఘాట్‌ రోడ్డు ఉంది. అయితే మినీ ఘాట్‌ పరిధిలో సుక్కుగాడిగూడ, డంగలగూడ, పొక్కిరి, పొక్కిరిగూడ, ఓడకొయ్యి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 150 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. జరడ చుట్టు పక్కల మరో 15 గిరిజన గ్రామాలు నీలకంఠాపురం-జరడ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంది. అయితే రోడ్డు బాగోలేకపోవడంతో కొన్నాళ్లుగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో వారి కష్టాలు రెట్టింపవుతున్నాయి. మరోవైపు ఆ మార్గంలో ద్విచక్రవాహనాలు, 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి . దీంతో ఆయా గిరిజన గ్రామస్థులు సకాలంలో వైద్య సేవలు అందలేకపోతున్నారు. అత్యవసర వేళల్లో వారికి డోలీ మోతలు తప్పడం లేదు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో గిరిజన గ్రామస్థులు కొద్దిరోజులుగా రోడ్డు పనుల్లో నిగమ్నమయ్యారు. చేయి చేయి కలిపి.. శ్రమదానం చేస్తున్నారు. రోడ్డుపై రాళ్లు తొలగించి.. గుంతల్లో మట్టి వేసి చదును చేస్తున్నారు. బుధవారం పొక్కిరి- డంగలగూడ గ్రామాల మధ్య బూరుగు చెట్టు వరకూ రోడ్డు బాగుచేసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:18 AM