Gusty Winds, Growing Panic! హోరుగాలి.. హడలి!
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:36 PM
Gusty Winds, Growing Panic! జిల్లాలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. గ్రామాల్లో అంధకారం నెలకొంది.
కూలిన చెట్లు.. విరిగిన విద్యుత్ స్తంభాలు
నిలిచిన ట్రాఫిక్.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
భామిని/సీతంపేట రూరల్, జూన్2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. గ్రామాల్లో అంధకారం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎండ ఠారెత్తించగా.. ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ తర్వాత వాతావరణం మారింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృత గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలుల కారణంగా భామిని మండలం ఘనసర సమీపంలో బూర్జి ఏబీరోడ్డులో చెట్టు కూలింది. దీంతో అటు కొత్తూరు, ఇటు బత్తిలి వైపు గంటలన్నర పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర, స్థానికులు సహకారంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక పోలవరం సమీపంలో 33 కేవీ విద్యుత్‌లైన్‌పై చెట్టుకొమ్మలు విరిగి పడడంతో మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా అందజేస్తామని ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా అకాల వర్షం వల్ల కల్లాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న పంటను కాపాడు కునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఇక సీతంపేట ఏజెన్సీలోనూ మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 44డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైంది. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడింది. కాగా వాతావరణం చల్లబడడంతో మన్యంవాసులు ఎండ వేడి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం చెందారు.