Share News

gurla gedda mini resurveror వడివడిగా అడుగులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:52 PM

gurla gedda mini resurveror గుర్ల గెడ్డ రిజర్వాయర్‌కు మంచిరోజులు రానున్నాయి. మంత్రి సంధ్యారాణి చొరవతో ఈ జలాశయం ఆయకట్టు రైతుల దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రిజర్వాయర్‌ పూర్తికి రూ.17 కోట్లు అవసరమని ఇరిగేషన్‌ అధికారులు గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు.

gurla gedda mini resurveror వడివడిగా అడుగులు
రిజర్వాయర్‌ భూములను పరిశీలిస్తున్న ఎస్‌ఈ అప్పలనాయుడు బృందం

వడివడిగా అడుగులు

గుర్ల గెడ్డ రిజర్వాయర్‌ దశ తిరిగే అవకాశం

రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఇరిగేషన్‌ అధికారులు

తాజాగా స్థల పరిశీలన

నెరవేరనున్న మంత్రి సంధ్యారాణి హామీ

మెంటాడ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): గుర్ల గెడ్డ రిజర్వాయర్‌కు మంచిరోజులు రానున్నాయి. మంత్రి సంధ్యారాణి చొరవతో ఈ జలాశయం ఆయకట్టు రైతుల దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రిజర్వాయర్‌ పూర్తికి రూ.17 కోట్లు అవసరమని ఇరిగేషన్‌ అధికారులు గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు.

మెంటాడ మండలంతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దున ఉన్న అనంతగిరి మండలంలో పది గ్రామాలకు చెందిన 2,900 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 2000లో రూ.4కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు కోసం 268 ఎకరాలు అవసరమని గుర్తించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి 138 ఎకరాలు కాగా రైతుల నుంచి 130 ఎకరాలు సేకరించారు. ప్రారంభంలో పనులు చురుగ్గా సాగినా నిధుల సర్దుబాటు కారణంగా కొన్నాళ్లకు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సర్‌ప్లస్‌ వాల్‌, కుడి, ఎడమ కాలువల నిర్మాణం 90 శాతం పూర్తి చేసుకున్నప్పటికీ వాటి ద్వారా ఆయుకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్‌ పూర్తిచేయాలని పలు పర్యాయాలు రైతులు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. రిజర్వాయర్‌ ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు. గత ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేసిన పీడిక రాజన్నదొర సైతం ఈ ప్రాజెక్టును ప్రచారానికి మాత్రమే వినియోగించుకున్నారన్న విమర్శ ఉంది.

- గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వున్న గుమ్మిడి సంధ్యారాణి చొరవ చూపడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మంగళవారం ఈ ప్రాజెక్టు స్థితిగతుల పరిశీలనకు జిల్లా ఇరిగేషన్‌ ఎస్‌ఈ అప్పలనాయుడు బృందం వచ్చింది. పరిశీలన అనంతరం త్వరలో మినీ రిజార్వాయర్‌ పనులు ప్రారంభమౌతాయని ఓ అధికారి సూచన ప్రాయంగా చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా ఎస్‌ఈ అప్పలనాయుడు మాట్లాడుతూ, రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. పర్యటనలో ఈఈ ఎంవీ రమణ, డీఈ నవీన్‌, రామునాయుడు, రైతు సంఘం నాయకుడు రాములు, రాజప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:53 PM