Share News

రాష్ట్ర పండుగగా గురజాడ జయంతి

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:23 AM

మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్ర పండుగగా గురజాడ జయంతి
గురజాడ విగ్రహం

- ప్రకటించిన ప్రభుత్వం

-ఏర్పాట్లలో యంత్రాంగం

విజయనగరం సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు డీఆర్వో చందక సత్తిబాబు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 21న నిర్వహించనున్న గురజాడ జయంతి కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, జిల్లా విద్యాశాఖలను భాగస్వాములను చేశారు. గురజాడ ఇంటి నుంచి ఆయన కాంస్య విగ్రహం వరకు జరిగే ఊరేగింపులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. అదే విదంగా ఆర్డీవో, అర్బన్‌ తహసీల్డార్‌ ప్రోటోకాల్‌ తీసుకోవాలన్నారు. గురజాడ స్వగృహాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని, ఆయన కాంస్య విగ్రహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మునిసిపల్‌ అధికారులకు సూచించారు. మహారాజ సంగీత కళాశాల తరఫున గురజాడ గేయాలను ఆలపించేందుకు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందించే బాధ్యత చేపట్టాలని ఆర్కీయాలజీ, పర్యాటక, సెట్వీజ్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో ప్రసాదరావు, పట్టణ తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాసరావు, మహారాజ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:23 AM