Gurajada Literary Consciousness Festival on the 30th 30న గురజాడ సాహితీ చైతన్యోత్సవం
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:00 AM
Gurajada Literary Consciousness Festival on the 30th మహాకవి గురజాడ వెంకట అప్పారావు వర్థంతిని పురస్కరించుకుని ఈ నెల 30న గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ ఉత్సవాన్ని నిర్వహించనుంది. ఏటా ఈ సమాఖ్య గురజాడ వర్థంతి వేళ.. ప్రముఖులను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరిస్తూ వస్తోంది.
30న గురజాడ సాహితీ చైతన్యోత్సవం
రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న గురజాడ సాంస్కృతిక సమాఖ్య
రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు గురజాడ విశిష్ట పురస్కారం
మరో ఆరుగురు జాతీయ స్థాయి కవులకు సత్కారం
మహాకవి గురజాడ వెంకట అప్పారావు వర్థంతిని పురస్కరించుకుని ఈ నెల 30న గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ ఉత్సవాన్ని నిర్వహించనుంది. ఏటా ఈ సమాఖ్య గురజాడ వర్థంతి వేళ.. ప్రముఖులను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరిస్తూ వస్తోంది. ఈ ఏడాది యండమూరి వీరేంద్రనాథ్‌కు విశిష్ట పురస్కారంతో పాటు జాతీయ స్థాయిలో ఆరుగురు ప్రముఖ కవులను ఘనంగా సన్మానించనుంది. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఒడిశా మాజీ గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారు.
విజయనగరం కల్చరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
గురజాడ వర్థంతిని ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆకాంక్షిస్తోంది. 30న ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు మొదలుకానున్నాయి. తొలుత గురజాడ స్వగృహంలో జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. అనంతరం మహాకవి గురజాడ ఉపయోగించిన వస్తువులను విద్యార్థులు చూపించనున్నారు. గురజాడ దేశభక్తి గీతాలాపనతో కవులు, కళాభిమానులు కలిసి గురజాడ గృహం నుంచి ఎంఆర్ కళాశాల వద్ద వున్న గురజాడ విగ్రహం వరకూ ఊరేగింపు ఉంటుంది. అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
కార్యక్రమాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత డాక్టర్ జక్కు రామకృష్ణ నిర్వహణలో ప్రముఖ రచయితలు స్వీయ కవితాపఠనం చేయనున్నారు. కన్యాశుల్కంలో మూఢ విశ్వాసాలపై నిర్వహించిన వృక్తత్వ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. అనంతరం గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను అరుగురికి అందజేయనున్నారు. జనజ్వాల వనపర్తి, డాక్టరు ఆళ్ల నాగేశ్వరరావు (తెనాలి), మణివదన్ వజ్జా (విశాఖపట్నం), గవిడి శ్రీనివాస్ (బెంగళూరు), అవ్వా శ్రీధర్ బాబు (నెల్లూరు) వీరికి ఉత్తమ కవితా పురస్కారాలు అందజేయనున్నారు. ఉత్తమ కవితా పురస్కారాన్ని హైదరాబాదుకు చెందిన పనసకర్ల ప్రకాష్‌నాయుడుకు అందజేయనున్నారు.
2000 నుంచి పురస్కారం
గురజాడ సాహితీ చైతన్యోత్సవాన్ని గురజాడ సాంస్కృతిక సమాఖ్య 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నది. ఏటా విశిష్ట సేవలు అందించిన ఎంతో మంది ప్రముఖులను గురజాడ పురస్కారంతో సత్కరిస్తున్నారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పీవీ నర్సింహారాజు, కాపుగంటి ప్రకాష్ ఉండేవారు. ప్రస్తుతం ఈ సమాఖ్యకు అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టరు ఎం.వెంకటేశ్వరరావు, మామిడిపాక అనిల్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య రజతోత్సవ వేడుకలను నిర్వహించనుంది.
గురజాడ అప్పారావు ప్రస్థానం
గురజాడ వెంకట అప్పారావు 1962 సెప్టెంబరు 21న అప్పటి విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలోని రాయవరంలో మేనమామ ఇంట్లో జన్మించారు. తన జీవితంలో ఎక్కువ భాగం విజయనగరంలోనే గడిపారు. విద్యతో పాటు ఉద్యోగం కూడా ఇక్కడే చేశారు. 1886లో బీఏ పూర్తిచేసి కొంత కాలం డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్ గుమస్తాగా పనిచేశారు. 1887లో విజయనగరం ఎంఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. 1891లో మహారాజా అనందగజపతి ఆస్థానంలో శాసనపరిశోధకులుగా నియమితులయ్యారు. 1892లో కన్యాశుల్కం పేరుతో తెలుగు నాటక రంగంలో అత్యుత్తమ రచన చేశారు. కన్యాశుల్కం ద్వారా బాల్య వివాహా దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆపై గిడుగు రామమూర్తితో కలిసి వ్యవహారికగా భాషా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, ముత్యాలసారం, దేశంను ప్రేమించమన్నా తదితర గేయాలను రాశారు. కుల,మత విభేదాలను వ్యతిరేకిస్తూ, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ వంటి సందేశాన్ని సమాజానికి అందించారు. అభ్యుదయ కవితాపితామహుడు, కవి శేఖర బిరుదులు పొందారు. 1915 నవంబరు 30న గురజాడ విజయనగరంలోనే అంతిమ శ్వాస విడిచారు.
పురావస్తుశాఖ ఆధీనంలో స్వగృహం
గురజాడ స్వగృహం పురావస్తుశాఖ ఆధీనంలో వుంది. ఆయన ఉపయోగించిన ప్రతివస్తువు ఆయనగృహంలోనే పదిలంగా వుంది. చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులు గురజాడ గృహాన్ని సందర్శిస్తుంటారు. గురజాడవారసులైన ఇందిర, ప్రసాద్‌లు గురజాడ గృహ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. భావితరాలకు గురజాడ చరిత్ర తెలిసేలా ఈ గృహాన్ని పురావస్తుశాఖ పరిరక్షిస్తోంది.
-----------------------