Share News

Gurajada Distinguished Award for Yandamoori Veerendranath యండమూరి వీరేంద్రనాథ్‌కు గురజాడ విశిష్ట పురస్కారం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:38 PM

Gurajada Distinguished Award for Yandamoori Veerendranath ప్రముఖ రచయిత, సామాజిక వేత్త యండమూరి వీరేంద్రనాథ్‌కు గురజాడ విశిష్ట పురస్కారం-2026 ప్రదానం చేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టరు ఎం.వెంకటేశ్వరరావు, మామిడిపాక అనిల్‌కుమార్‌లు చెప్పారు. ఈ నెల 30న ప్రదానం చేస్తామన్నారు.

Gurajada Distinguished Award for Yandamoori Veerendranath యండమూరి వీరేంద్రనాథ్‌కు   గురజాడ విశిష్ట పురస్కారం
కరపత్రాన్ని విడుదల చేస్తున్న గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు

యండమూరి వీరేంద్రనాథ్‌కు

గురజాడ విశిష్ట పురస్కారం

30న ప్రదానం

గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధుల వెల్లడి

విజయనగరం కల్చరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, సామాజిక వేత్త యండమూరి వీరేంద్రనాథ్‌కు గురజాడ విశిష్ట పురస్కారం-2026 ప్రదానం చేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టరు ఎం.వెంకటేశ్వరరావు, మామిడిపాక అనిల్‌కుమార్‌లు చెప్పారు. ఈ నెల 30న ప్రదానం చేస్తామన్నారు. గురజాడ స్వగృహంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గురజాడ సాంస్కృతిక సమాఖ్య 2000 సంవత్సరంలో ఏర్పాటైందని, అప్పటి నుంచి ఏటా మహాకవి గురజాడ అప్పారావు వర్థంతి రోజు నవంబరు 30న గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది యండమూరి వీరేంద్రనాథ్‌ను ఎంపిక చేశామన్నారు. ఈయన తెలుగుభాషలో అద్భుతమైన రచనలు చేశారని, నవలా రచయిత, స్ర్కీన్‌ ప్లే రైటర్‌గా, మూఢనమ్మకాలు, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితుడయ్యారని అన్నారు. ఈయన తీసిన మొదటి చిత్రానికి రాష్ట్రపతి నుంచి ఉత్తమ ప్రాంతీయ అవార్డు లభించిందన్నారు. 1982లో రఘుపతిరాఘవ రాజ్‌రామ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారని, 1996లో వెన్నెల్లో ఆడ పిల్ల అనే తెలుగుసీరియల్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు పొందారని, 2002లో విజయంవైపు పయనం కోసం అనే టెలీ చిత్రానికి నంది అవార్డు దక్కిందని, మరో 50 అవార్డులు ఆయన స్వీకరించారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తికి గురజాడ సాంస్కృతిక సమాఖ్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రదానం చేస్తున్నామన్నారు. అదే రోజు జాతీయ స్థాయిలో ఆరుగురు వర్థమాన కవులను గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు. గురజాడ వర్థంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ఆవిష్కరించారు. సమావేశంలో సభ్యులు గోకరాజు సూర్యలక్ష్మీ, ఈ.విజయ్‌కుమార్‌, గురజాడ ఇందిర, భరద్వాజ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:38 PM