Share News

Gudibanda to DCCB డీసీసీబీకి గుదిబండ

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:09 AM

Gudibanda to DCCB జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డీసీసీబీ)కి టిడ్కో ఇళ్ల రుణాలు గుదిబండగా మారాయి. బకాయిలు రూ.91 కోట్లు ఉండడంతో వాటినెలా వసూలు చేయాలోనని సిబ్బంది మథనపడుతున్నారు. ఇళ్లప్పగిస్తేనే వాయిదాలు చెల్లిస్తామని రుణగ్రహీతలు చెబుతున్నారు.

Gudibanda to DCCB డీసీసీబీకి గుదిబండ
డీసీసీబీ బ్యాంకు

డీసీసీబీకి గుదిబండ

భారంగా మారిన టిడ్కో ఇళ్ల రుణాలు

ఇళ్లప్పగిస్తేనే వాయిదాలు చెల్లిస్తాం: రుణగ్రహీతలు

పేరుకుపోయిన బకాయిలు రూ.91 కోట్లు

విజయనగరం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ( డీసీసీబీ)కి టిడ్కో ఇళ్ల రుణాలు గుదిబండగా మారాయి. బకాయిలు రూ.91 కోట్లు ఉండడంతో వాటినెలా వసూలు చేయాలోనని సిబ్బంది మథనపడుతున్నారు. ఇళ్లప్పగిస్తేనే వాయిదాలు చెల్లిస్తామని రుణగ్రహీతలు చెబుతున్నారు.

2019 నుంచి 2024 వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు డీసీసీబీలు, వాటి అనుబంధ శాఖల ద్వారా రుణాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.91 కోట్ల 42 లక్షల రూపాయలను డీసీసీబీ రుణాలుగా అందించింది. అంతకుముందు 2014 నుంచి 2019 వరకూ అధికారంలో వున్న టీడీపీ టిడ్కో ఇళ్లకు రూపకల్పన చేసి ఇళ్ల నిర్మాణాన్ని 60 శాతం వరకూ పూర్తి చేశారు. మౌలిక సదుపాయల కల్పన కూడా 50 శాతం కొలిక్కితెచ్చారు. ఈలోగా సాధారణ ఎన్నికలు రావడం, వైసీపీ అధికార బాధ్యతలు చేపట్టడం జరిగింది. టిడ్కో ఇళ్లను అలాగే ఉంచుతూ, సెంటు స్థలంలో ఇళ్లు ఇవ్వాలని ఆ ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ఆ సమయంలో టిడ్కో లబ్ధిదారులకు మద్దతుగా అప్పటి ప్రతిపక్షంగా వున్న టీడీపీ ఉద్యమించింది. టిడ్కో లబ్ధిదారులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. దీనికి స్పందించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులు అందరికీ డీసీసీబీ ద్వారా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో వున్న లబ్ధిదారులకు డీసీసీబీ ద్వారా రుణాలిచ్చి వదిలేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇతర సహాయం చేయలేదు. దీంతో అన్నిచోట్లా ఇళ్లు అసంపూర్తిగానే ఉండిపోయాయి.

ఇళ్లప్పగిస్తేనే.. వాయిదాలు చెల్లిస్తామంటున్న రుణగ్రహీతలు

డీసీసీబీ, దాని అనుబంధ శాఖల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు తిరిగి బ్యాంకు వాయిదాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. విజయనగరంలోని సారిపల్లిలో ఎన్టీఆర్‌ నగర్‌, కొండవెలగాడ రోడ్డులోని సోనియానగర్‌ తదితర ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల సముదాయం వుంది. సారిపల్లిలో కొంత మందికి ఇళ్లిచ్చినా మౌలిక సదుపాయాలు లేవు. అదే పరిస్థితి సోనియానగర్‌లో వుంది. నెల్లిమర్ల, బొబ్బిలిలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా తక్కువ మంది మాత్ర మే ఆ ఇళ్లలో ఉంటున్నారు. డీసీసీబీ ద్వారా రుణాల వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇంట్లో దిగితేనే కాని రుణం తిరిగి చెల్లించలేమని లబ్ధిదారులు చెబుతున్నారు.

రుణ వసూలు అనేది నిరంతర ప్రక్రియ

సీహెచ్‌ ఉమామహేశ్వరరావు, సీఈఓ, డీసీసీబీ

రుణ వసూలు అనేది నిరంతర ప్రక్రియ. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు టిడ్కో లబ్ధిదారులకు రుణాలు ఇచ్చాం. వారు తిరిగి కట్టాల్సి ఉంది. ఇందుకోసం బ్యాంకు సిబ్బంది లబ్ధిదారులతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారు. టిడ్కో ఇళ్లకి సంబంధించి రుణాలు పొందిన వారంతా తిరిగి రుణ వాయిదాలను సకాలంలో డీసీసీబీ, వాటి అనుబంధ శాఖలకు చెల్లించాలి.

===============

Updated Date - Jan 25 , 2026 | 12:09 AM