Share News

Turmeric Cultivation 8 వేల ఎకరాల్లో పసుపు సాగుకు సై

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:23 PM

Green Signal for Turmeric Cultivation on 8,000 Acres సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతుల దశ తిరగనుంది. ఏజెన్సీలో పసుపు సాగును భారీఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాబోయే మూడేళ్లలో (2027-28 నుంచి 2029-30 వరకు) ఏకంగా 8,000 ఎకరాల్లో ‘పసుపు సాగు విస్తరణ కార్యక్రమాన్ని’ అమలు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ (బడ్జెట్‌) కార్యదర్శి ఎంఎం నాయక్‌ సెప్టెంబర్‌ 10న జీవో ఆర్టీ నెం. 85 ను జారీ చేశారు.

  Turmeric Cultivation   8 వేల ఎకరాల్లో పసుపు సాగుకు సై
సీతంపేట మండలం సుందరయ్యగూడ లో సాగవుతున్న పసుపుపంట

  • రానున్న మూడు సంవత్సరాల్లో అమలు

  • రూ. 38.40 కోట్లతో భారీ ప్రాజెక్టు

  • గిరిజన రైతులకు 75 శాతం సబ్సిడీ..

  • తొలి ఏడాది కార్యాచరణకు రూ. 5.76 కోట్లు మంజూరు చేసిన సర్కారు

  • ఇన్‌చార్జి పీవో ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ జీవో 85 జారీ

శ్రీకాకుళం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతుల దశ తిరగనుంది. ఏజెన్సీలో పసుపు సాగును భారీఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాబోయే మూడేళ్లలో (2027-28 నుంచి 2029-30 వరకు) ఏకంగా 8,000 ఎకరాల్లో ‘పసుపు సాగు విస్తరణ కార్యక్రమాన్ని’ అమలు చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ (బడ్జెట్‌) కార్యదర్శి ఎంఎం నాయక్‌ సెప్టెంబర్‌ 10న జీవో ఆర్టీ నెం. 85 ను జారీ చేశారు. పసుపు సాగు సాగు విస్తరణ కోసం సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించి ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. ఈ పసుపు సాగు విస్తరణ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 38.40 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఎంఐడీహెచ్‌ మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన శాఖ నిధులతో అనుసంధానం చేసి ఈ పథకాన్ని సీతంపేట ఐటీడీఏ అమలు చేయనుంది. పసుపు సాగుకు ఎకరాకు యూనిట్‌ ధర రూ. 48 వేలుగా నిర్ణయించారు. ఇందులో 40 శాతం (రూ. 15.36 కోట్లు) గిరిజన సంక్షేమ శాఖ సబ్సిడీగా ఇస్తుండగా, మరో 35 శాతం (రూ. 13.44 కోట్లు) ఉద్యాన శాఖ సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన 25 శాతం (రూ. 9.60 కోట్లు) మాత్రమే రైతులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.

నిధుల కేటాయింపు ఇలా...

- మొదటి ఏడాది (2027-28) : సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురం మన్యంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మొత్తంగా 3,000 ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా, ప్రాజెక్టు వ్యయం రూ. 14.40 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఎంఐడీహెచ్‌ వాటా రూ. 5.04 కోట్లు కాగా, గిరిజన సంక్షేమ శాఖ వాటా కింద రూ. 5.76 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. రైతుల వాటా రూ. 3.60 కోట్లుగా ఉంటుంది.

- రెండో ఏడాది (2028-29) : 3,000 ఎకరాల్లో సాగు లక్ష్యం. వ్యయం రూ. 14.40 కోట్లు. ఇందులో ఎంఐడీహెచ్‌ వాటా రూ. 5.04 కోట్లు, గిరిజన శాఖ వాటా రూ. 5.76 కోట్లు, రైతుల వాటా రూ. 3.60 కోట్లు.

- మూడో ఏడాది (2029-30) : మిగిలిన 2,000 ఎకరాల్లో సాగు లక్ష్యం. వ్యయం రూ. 9.60 కోట్లు. ఇందులో ఎంఐడీహెచ్‌ వాటా రూ. 3.36 కోట్లు, గిరిజన శాఖ వాటా రూ. 3.84 కోట్లు, రైతుల వాటా రూ. 2.40 కోట్లు

నిబంధనలు ఇవే..

నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ‘గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చే 40శాతం సబ్సిడీ కేవలం అర్హులైన గిరిజన రైతులకు మాత్రమే దక్కాలి. ఆమోదించిన విస్తీర్ణంలో వాస్తవంగా సాగు చేసిన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలి. ఎంఐడీహెచ్‌ లేదా ఇతర పథకాల్లో ఒకే సాగుకు రెండుసార్లు సబ్సిడీ తీసుకోకుండా జాగ్రత్త పడాలి. రైతులు తమ వంతు వాటా అయిన 25 శాతం చెల్లించినట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతే గిరిజన సంక్షేమ శాఖ సబ్సిడీని విడుదల చేయాలి. లబ్ధిదారుల వివరాలు, సాగు విస్తీర్ణం, ఇన్‌పుట్స్‌ తదితర వివరాలను అమలు చేసే ఏజెన్సీ పక్కాగా నమోదు చేసి వెరిఫై చేయాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాల కొనుగోళ్లతో ఏపీ ట్రెజరీ, ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఆ తర్వాత ఏడాది నిధులు అడిగే ముందు, గత ఏడాది సాధించిన లక్ష్యాలు, ఖర్చుల వివరాలతో నివేదిక సమర్పించాలి. ఈ ప్రాజెక్టు అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని సీతంపేట ఐటీడీఏ పీవో, ట్రైకార్‌ ఎండీలను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Sep 12 , 2026 | 11:23 PM