Share News

Gramakantam గ్రామకంఠాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 23 , 2026 | 11:14 PM

Green Signal for Registration of Gramakantam Lands పల్లె, పట్టణవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామ కంఠంలోని ఇళ్లు, భూములు, వారసత్వంగా వచ్చిన స్థలాలకు రిజిస్ర్టేషన్‌ చేయాలని నిర్ణయించింది.

  Gramakantam  గ్రామకంఠాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

  • వారసత్వంగా వచ్చిన స్థలాలకూ లైన్‌క్లియర్‌

  • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

పాలకొండ, మే 23(ఆంధ్రజ్యోతి): పల్లె, పట్టణవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామ కంఠంలోని ఇళ్లు, భూములు, వారసత్వంగా వచ్చిన స్థలాలకు రిజిస్ర్టేషన్‌ చేయాలని నిర్ణయించింది. గ్రామ కంఠంలోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నా, అందులో ప్రజల ఇళ్లు, నివాస స్థలాలు ఉన్నా.. సబ్‌ డివిజన్‌ చేసి నిర్దిష్ట డాక్యుమెంట్లు ఆధారంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మార్గదర్శకాలు ఇవే...

వెబ్‌ల్యాండ్‌లో గ్రామ కంఠం అని ఉంటే రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి. సర్వే నెంబర్‌ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నా, లేకున్నా గ్రామ కంఠం అయితే కచ్చితంగా రిజిస్ర్టేషన్‌ చేయాలి. 2015లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై జీవో జారీ చేసింది. అయితే 22ఏ నుంచి తొలగించినా, రెవెన్యూ రికార్డుల సబ్‌ డివిజన్‌ జరగకపోవడం వల్ల ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఆగింది. తాజాగా దీనిపై మార్గదర్శకాలు జారీ కావడంతో గ్రామకంఠం రిజిస్ర్టేషన్‌కు మార్గం సుగమమైంది.

లింకు డ్యామెంట్లు లేకపోయినా స్థానిక సంస్థలు జారీ చేసిన హౌస్‌ ట్యాక్స్‌ రశీదు ఆధారంగా రిజిస్ర్టేషన్‌ చేయాలి. అర్బన్‌ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు లింకు పత్రాలు లేకపోతే వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ వీఎల్‌టీ రిసిప్ట్‌ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రశీదులు, లింకు డాక్యుమెంట్లు లేకపోతే రిజిస్ర్టేషన్‌ పత్రంలోనే స్వయం ధ్రువీకరణ పత్రం చేర్చాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తి హక్కు, 22ఏలో ఆ భూమి లేదని రాయాలి. రెవెన్యూ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని రిజిస్ర్టేషన్‌ అధికారులు ఒత్తిడి చేయకూడదు. నేరుగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ర్టేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మార్గ దర్శకాలు అమలులోకి వచ్చాయి. ‘గ్రామ కంఠాల్లోని ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లు, ఖాళీ స్థలాలకు సం బంధించి నిబంధనల మేరకు రిజి స్ర్టేషన్‌ చేస్తున్నాం. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని రిజి స్ర్టేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాం. సాధారణ రిజిస్ర్టేషన్‌ మాదిరిగానే స్టాంప్‌ డ్యూటీ ఐదు శాతం, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు 1.5 శాతం, ఫీజు ఒక శాతం.. మొత్తంగా 7.5 శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజు వసూలు చేస్తున్నాం. ’ అని జిల్లా రిజిస్ర్టార్‌ పార్వతి తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 11:14 PM