Share News

Green signal for freehold registrations ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు ఓకే

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:18 AM

Green signal for freehold registrations జిల్లాలో ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్‌) పొందిన భూములకు విముక్తి కలగనుంది. రిజిస్ట్రేషన్‌లు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలు ప్రకటించే అవకాశఽం ఉంది.

Green signal for freehold registrations ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు ఓకే

ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు ఓకే

రెండేళ్లుగా నిషేధం విధించిన కూటమి ప్రభుత్వం

ఇకపై నిరభ్యంతరం

జిల్లాలో 15 ఎకరాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు గతంలో గుర్తింపు

అధికారులపై తీసుకున్న చర్యలపై స్పష్టత కరువు

తాజా నిర్ణయంతో పేద రైతులకు పెద్ద ఊరట

జిల్లాలో ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్‌) పొందిన భూములకు విముక్తి కలగనుంది. రిజిస్ట్రేషన్‌లు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలు ప్రకటించే అవకాశఽం ఉంది. వీటిపై రెండేళ్లగా కూటమి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేస్తోంది. ఇకపై నిషేధం ఉండదు. ఈ నిర్ణయంతో జిల్లాలో వేలాది మంది పేద రైతులకు మేలు చేకూరనుంది. ఆయా భూములకు భద్రతే కాదు ధర కూడా పెరగనుంది.

శృంగవరపుకోట/విజయనగరం కలెక్టరేట్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి):

- మెరకముడిదాంలో ఎకరం, దత్తిరాజేరులో 0.36 ఎకరాలు, గంట్యాడ 1.25 ఎకరాలు, డెంకాడ 5.1 ఎకరాలు, గజపతినగరం 6.11 ఎకరాలు, విజయనగరం 11.56 ఎకరాలు, భోగాపురం 19.6 ఎకరాలు, రామభద్రపురం 33.88 ఎకరాలు, వేపాడలో 100.55 ఎకరాలు

- మండలాల వారీగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన ఫ్రీహోల్డ్‌ భూముల వివరాలివి.

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్‌ చట్టం ద్వారా జిల్లాలో 7,490.62 ఎకరాలకు రైతులు యాజమాన్య హక్కులు పొందారు. ఫ్రీహోల్డ్‌ జరిగిన వెనువెంటనే 179.41 ఎకరాలకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేసారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 25ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. దీంతో తీవ్ర అరోఫణలు వచ్చాయి. యాజమాన్య హక్కులు కల్పించే పేరుతో నిబంధనలను పక్కన పెట్టి పేదల భూములను వైసీపీ నేతలు, భూ కబ్జాదారులు హస్తగతం చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీహోల్డ్‌ భూముల క్రయ, విక్రయాల ప్రక్రియను నిలిపేసింది. ఇందులో జరిగిన అవకతవకలను నిగ్గుతేల్చేందుకు మంత్రి మండలి ఉపసంఘాన్ని నియమించింది. జిల్లాలో పరిశీలన బాద్యతను ఇన్‌చార్జి మంత్రికి అప్పగించారు. అయితే 2025 మార్చిలో జిల్లాకు చెందిన ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గంట్యాడలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 15 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు జరిగినట్లు తెలిపారు. నోటీస్‌లు జారీ చేసామని పేర్కొన్నారు. ఆ తరువాత అధికారికంగా వీటిపై ఎటువంటి ప్రకటన లేదు.

- అక్రమంగా జరిగిన ఫ్రీహోల్డ్‌ రిజిస్టేషన్‌లను రద్దు చేసారా? ఈ భూములను తిరిగి నిషేధిత జాబితాలో చేర్చారా? అసైన్డ్‌ రైతుకు తిరిగి భూమిని అప్పగించారా? ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసేసుకుందా అన్న వివరాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా క్రయ, విక్రయాలకు అవకాశం ఇచ్చిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దానిపైన స్పష్టత లేదు.

- ఫ్రీహోల్డ్‌ సమయంలో అప్పటి అధికార వైసీపీ, రెవెన్యూ అధికారుల సహకారంతో అసైన్డ్‌ రైతుల భూములకు చట్టబద్ధత కల్పించారు. ఆ వెంటనే అప్పటికే కోనుగోలు చేసిన వారిలో కొందరు వారిపేరున అధికారికంగా రిజిస్ట్రేషన్‌లు చేసేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం నిషేధంలో పెట్టడంతో ఇలాంటి భూములు చాలా వరకు క్రయవిక్రయాలు జరగకుండా అగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిషేధాన్ని సడలించనుండడంతో వీటన్నింటి ధరలు తిరిగి రెక్కలు తొడగనున్నాయి.

- ఫ్రీహోల్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్‌లను ఆపేయడంతో నిజమైన యాజమాన్య హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది రైతులకు ఎకరా నుంచి మూడు ఎకరాల లోపు భూములున్నాయి. ఫ్రీహోల్డ్‌ జరగడంతో పిల్లల చదువులు, వివాహాలకు విక్రయించుకోవచ్చునని భావించిన వీరికి రిజిస్ట్రేషన్‌లు జరగకుండా విధించిన నిషేధం ఆర్థిక అవస్థలు తెచ్చిపెట్టింది. ఫ్రీహోల్డ్‌ జరిగినప్పటికీ వీటిని అసైన్డ్‌ భూములుగానే చేస్తున్నారు. తక్కువ ధరకు అడుగుతున్నారు. దీంతో వీటిని అమ్మలేక, కుటుంబ అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం నిషేధం సడలిస్తుందని ఆశతో వున్న వీరు అవసరానికి అప్పులు చేసుకుంటూ కాలం వెళ్లదీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌లకు అవకాశం ఇస్తున్నారన్న ప్రచారం వీరిని కుదరుగా నిలువనీయడం లేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడొస్తాయానని ఎదురుచూస్తుండడంతో పాటు కనిపించిన రెవెన్యూ అధికారుల వద్ద ఆరా తీస్తున్నారు.

------------------

Updated Date - Sep 14 , 2026 | 12:18 AM