Share News

సీఏడీడబ్ల్యూఎం పనులకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:49 PM

పాచిపెంట మండలం పెద్దగెడ్డ రిజర్వాయర్‌ వద్ద మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌ (సీఏడీడబ్ల్యూఎం) పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సీఏడీడబ్ల్యూఎం పనులకు గ్రీన్‌సిగ్నల్‌
పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్‌

- పెద్దగెడ్డ రిజర్వాయర్‌ వద్ద చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం

- 14.8శాతం పెరిగిన అంచనా వ్యయం

- త్వరలో పనులు ప్రారంభం

- ఉమ్మడి జిల్లాలో 7,567 ఎకరాలకు అందనున్న సాగునీరు

పార్వతీపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం పెద్దగెడ్డ రిజర్వాయర్‌ వద్ద మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌ (సీఏడీడబ్ల్యూఎం) పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో రెండుసార్లు టెండర్ల దశ వరకు వెళ్లి ఈ పనులు ఆగిపోయాయి. అయితే, ఎట్టకేలకు ఈ పనులకు మోక్షం కలిగింది. 15శాతం పెరిగిన అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు శుక్రవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సమాచారం. అధికారికంగా ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పనులు ప్రారంభించనున్నారు.

రాష్ట్రం నుంచే తొలిసారిగా...

ప్రధాన మంత్రి కృషి సించాయ్‌ యోజన(పీఎంకేఎస్‌వై) సబ్‌స్కీమ్‌ కింద మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌(సీఏడీడబ్ల్యూఎం) పథకానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది శ్రీకారం చుట్టింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైపులైన్లు వేసి వాటిద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచే శ్రీకారం చుట్టింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దగెడ్డ రిజర్వాయర్‌ వద్ద ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడంతో కేంద్రం ఆమోదించింది. ఈ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ పనులకు సంబంధించి రూ.73.55 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. అనంతరం టెండర్లను పిలిచింది. అయితే, రెండుసార్లు కూడా అధిక మొత్తానికి కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడంతో ఖరారు వాయిదా పడింది. మూడోసారి 14.8 శాతం అధికంగా కోట్‌ చేస్తూ కాంట్రాక్టర్‌ టెండరు దాఖలు చేశాడు. దీన్ని ఆమోదించే అధికారం జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులకు లేకపోవడంతో ఈ విషయాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన మంత్రివర్గం అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. అయితే, అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో కారణాలు చెప్పాలని ఈ నెల 9 తేదీ సాయంత్రం జిల్లా ఇరిగేషన్‌శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. పెద్దగెడ్డ రిజర్వాయర్‌ ద్వారా వేయాల్సిన పైపులు మన రాష్ట్రంలో దొరకవని, మధ్యప్రదేశ్‌ నుంచి ఆ పైపులను తీసుకురావాల్సి ఉందని తెలియజేస్తూ వాటి ధరల వివరాలను జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై మం త్రివర్గ సమావేశంలో చర్చించి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. దీంతో పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది.

సాగునీటి వృథాకు అడ్డుకట్ట

సాగునీరు వృథా కాకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌ (సీఏడీడబ్ల్యూఎం) పనులను తెరమీదకు తెచ్చాయి. సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా చేసేటప్పుడు శివారు భూములకు చేరకపోవడం, కాలువలకు గండ్లు పడడం, కాలువల నిర్వహణకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున సొమ్ము ఖర్చు చేయాల్సి రావడం వంటి కారణాలతో సీఏడీడబ్ల్యూఎం పనులు చేపట్టేందుకు పూనుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైపులైన్లు వేసి భూములకు నీటిని సరఫరా చేయనున్నాయి. దీనివల్ల నీరు వృథా అవ్వదని, ఈ పనులు విజయవంతం అయితే ప్రతి ప్రాజెక్టు ద్వారా ఇదే విధంగా సాగునీరు అందించాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తుంది. పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద చేపట్టే మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌ (సీఏడీడబ్ల్యూఎం) పనుల ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలోని 7,567 ఎకరాలకు సాగునీరు అందనుంది.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..

పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద సీఏడీడబ్ల్యూఎం పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించి నిధులు మంజూరు చేశాయి. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినప్పటికీ ఖరారు కాలేదు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని చంద్రబాబును కోరాను. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు ప్రారంభించేందుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు.

-గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర గిరిజనశాఖా మంత్రి.

ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు

పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి రామభద్రపురం, పాచిపెంట మండలాలకు పైపులైన్ల ద్వారా సాగునీరు అందించేందుకు సీఏడీడబ్ల్యూఎం పనులు చేపట్టనున్నాం. పైపుల ధరలు తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. అధికారికంగా ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

-సురేష్‌, వాటర్‌ మేనేమెంట్‌ ఇన్‌చార్జి, సీఏడీడబ్ల్యూఎం.

Updated Date - Jul 10 , 2026 | 11:49 PM