వేతనదారులకు మరింత భరోసా
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:21 AM
ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్‌జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
వేతనదారులకు మరింత భరోసా
వీబీజీ రామ్‌జీని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం/ విజయనగరం కలెక్టరేట్, జూలై2(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులతో వేతనదారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిన్నాం గ్రామంలోని తామరచెరువులో వీబీజీ రామ్‌జీ(ఉపాధి హామీ) పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో ఉపాధి హామీ పనులు బాగా చేపట్టడంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ఈసారి మన రాష్ట్రానికి 15 కోట్ల పనిదినాలు కేటాయించారని గుర్తుచేశారు. కొత్త చట్టంతో గతంలో కూలీలకు ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచారని చెప్పారు. కొత్తగా మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, డ్వామా పీడీ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి వీబీజీరామ్‌జీ పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎంఎస్‌ఎంఈ ,సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వీబీజీరామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవకా మిషన్ గ్రామీణ్)ను జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి శ్రీనివాస్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తిరుపతిలో జరిగిన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎల్‌ఈడీలో వీక్షించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసుతుల అభివృద్ధికి ఇంతవరకూ ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ కీలకంగా నిలిచిందని అన్నారు. దీని స్థానంలో కొత్తగా అమల్లో వచ్చిన వీబీజీరామ్‌జీ పథకాన్ని అత్యున్నతంగా మార్చారని, దీని వల్ల గ్రామాల్లో మరింత అభివృద్ధి, ఆర్థికి ప్రగతికి అవకాశం ఉంటుందన్నారు.
- ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ కొత్త పథకంలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఆన్‌లైన్ అటెండెన్స్, పని అప్రూవల్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని వల్ల వేతనాలు నేరుగా కార్మికులు ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీఆర్‌వో చందక సత్తిబాబు, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, డ్వామా పీడీ శారదాదేవి పాల్గొన్నారు.
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్‌కు తన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.