మహా పండుగ
ABN , Publish Date - May 28 , 2026 | 11:12 PM
జిల్లాలో మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైబ్రీడ్ పద్ధతిలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.
- జిల్లాలో ముగిసిన మహానాడు
- రెండో రోజూ అదే ఉత్సాహం
- టీడీపీ శ్రేణుల సందడి
- ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
పార్వతీపురం, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైబ్రీడ్ పద్ధతిలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. చివరి రోజు గురువారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన మహానాడులో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయచంద్ర, కురుపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలు, నాయకులు మధ్య ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు పార్టీ ఆవిర్భావం తదితర అంశాలపై ప్రసంగించారు. ఇందులో నాలుగు నియోజకవర్గాల పరిశీలకులు ఎమ్మెల్సీ గ్రీష్మ, రాజబాబు, ఎం.వెంకటేష్, వనజాక్షీ పరిశీలకులు భాగస్వాములయ్యారు. సాలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడులో పాల్గొన్నారు.
- తొలిసారిగా జిల్లాలోని 42 క్లస్టర్ల పరిధిలో హై బ్రీడ్ పద్ధతిలో మహానాడు కార్యక్రమం జరిగింది. గతంలో రాష్ట్రంలో ఏదో ఒకచోట జరిగే మహానాడుకు జిల్లా నుంచి కొంతమంది నాయకులు మాత్రమే వెళ్లి పాల్గొనే అవకాశం ఉండేది. తాజాగా, పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ల వారీగా నిర్వహించడంతో మొదటిరోజు బుధవారం సుమారు 13వేల మంది, రెండో రోజు గురువారం సుమారు 15 వేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.