Grand rituals performed for the Sirimanu tree. సిరిమాను చెట్టుకు వైభవంగా పూజలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:46 PM
Grand rituals performed for the Sirimanu tree. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం విజయనగరం పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా గుర్తించిన సిరిమాను చెట్టుకు సోమవారం వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. జొన్నవలసలోని బూర్లె శ్రీనివాసు, రవి కళ్లాల్లో వున్న చింతచెట్లను ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.
సిరిమాను చెట్టుకు
వైభవంగా పూజలు
జొన్నవలస చేరుకున్న ఎమ్మెల్యే, ఆలయ అధికారులు
దర్శించేందుకు వేలాదిగా భక్తుల రాక
12న నగరానికి సిరిమాను చెట్టు
విజయనగరం కల్చరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం విజయనగరం పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా గుర్తించిన సిరిమాను చెట్టుకు సోమవారం వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. జొన్నవలసలోని బూర్లె శ్రీనివాసు, రవి కళ్లాల్లో వున్న చింతచెట్లను ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ఈ చెట్లకు సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, బొట్టుపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిమాను, ఇరుసుమాను చెట్లకు పసుపు, కుంకుమలు సమర్పించి పసుపుతో అమ్మవారి ప్రతిమ చేసి బొట్టుపెట్టారు. ఈ తంతు ఉదయం 9.30 గంటలకు సాంప్రదాయబద్ధంగా మొదలైంది. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల చేత వేద పండితుడు తేజోమూర్తుల అచ్యుత నాగేంద్రశర్మ పూజలు చేయించారు. పసుపు కుంకాలతో అభిషేకాలు.. ఆపై వస్త్రాలంకరణ అనంతరం అమ్మవారి చెట్టుకు బొట్టు పెట్టే తంతు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వందలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి సిరిమాను వృక్షానికి నమస్కరించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మతో పాటు కూటమి నాయకులు, పైడిమాంబ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.
- ఈ నెల 12న ఉదయం 8.30 గంటలకు సిరిమాను చెట్టును కొట్టే కార్యక్రమం జరుగుతుందని, అనంతరం సిరిమాను, ఇరుసుమానును విజయనగరం తరలిస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆ రోజు పండుగ వాతావరణంలో జొన్నవలసలో భారీ అన్నదానంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడుతూ, ఈనెల 27న పైడిమాంబ సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈనెల 1న పందిరిరాటతో పాటు మండల దీక్ష ప్రారంభమైందన్నారు. ఈ దీక్షల్లో తాను అమ్మవారి మాల ధరించానని, ఆ తర్వాత అమ్మవారు తన కలలో కన్పించి జొన్నవలసలో బూర్లె శ్రీనివాస్, రవికి చెందిన కళ్లాల్లో చింతచెట్లు ఉన్నట్లు చెప్పారని తెలిపారు. తమ కల్లాల వద్ద అమ్మవారి సిరిమాను చెట్లు ప్రత్యక్ష్యం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చెట్లు యాజమానులు శ్రీనివాస్, రవి, కుటుంబ సభ్యులు తెలిపారు. అమ్మవారిని తమ ఇంటిదేవతగా కొలుస్తున్నామని, అందుకే ఈ అదృష్టం కలిగినట్టు వారు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు రాజేష్‌బాబు, ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, వివిధ గ్రామాల ప్రజలు పూజల్లో పాల్గొన్నారు.