Maha Celebration ‘మహా’ సంబరం
ABN , Publish Date - May 28 , 2026 | 12:36 AM
Grand Maha Celebration జిల్లాలో టీడీపీ పసుపు పండుగ కార్యకర్తల కేరింతలతో ప్రారంభమైంది. ఎటు చూసినా పసుపు కండువాలు, టోపీలు ధరిస్తూ విజయసంకేతం చూపుతూ శ్రేణులు రోజంతా సందడి చేశాయి. తొలిరోజు అన్నిచోట్లా సభలు విజయవంతమయ్యాయి.
క్లస్టర్ల పరిధిలో తెలుగు తమ్ముళ్లలో జోష్
భాగస్వాములైన ప్రజాప్రతినిధులు
ఎల్‌ఈడీ స్ర్కీన్లపై అధినేత చంద్రబాబును చూస్తూ కేరింతలు
నాలుగు నియోజకవర్గాల్లో సందడి వాతావరణం
పార్వతీపురం, మే27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీడీపీ పసుపు పండుగ కార్యకర్తల కేరింతలతో ప్రారంభమైంది. ఎటు చూసినా పసుపు కండువాలు, టోపీలు ధరిస్తూ విజయసంకేతం చూపుతూ శ్రేణులు రోజంతా సందడి చేశాయి. తొలిరోజు అన్నిచోట్లా సభలు విజయవంతమయ్యాయి. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా నాలుగు నియోజకవర్గాల్లోని 42 క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలుచోట్ల భారీ స్ర్కీన్లు, టీవీలు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రసంగాలను వీక్షించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ కార్యాలయంలో జరిగిన మహానాడులో పాల్గొన్నారు. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురంలో, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నర్సిపురం, బలిజిపేట, సీతానగరంలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. పాలకొండలో నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మిగిలిన చోట్ల క్లస్టర్ ఇన్‌చార్జిల పర్యవేక్షణలో మహానాడు నిర్వహించారు. మహానాడు ప్రాముఖ్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ప్రస్థానం తదితర అంశాలపై ఆయా వేదికలపై జిల్లా ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. కురుపాం మండలం మొండెంఖల్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. మొత్తంగా ఈ సారి హైబ్రిడ్ విధానంలో మహానాడు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగి ప్రతి కార్యక్రమాన్ని స్ర్కీన్లలో జిల్లానేతలు స్థానికంగా వీక్షించారు.
ఎంతో ఆనందంగా ఉంది: మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం/సాలూరు, మే 27(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడులో పాల్గొనడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం ఎప్పటికీ మరువలేనని చెప్పారు. తొలిసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పార్టీలో ఇకపై మహిళ లకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.