Share News

ధాన్యానికి మొలకలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:50 PM

Grains Begin to Sprout జిల్లాలో రైస్‌ మిల్లుల నుంచి బియ్యం నిల్వలు కదలడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీగా లేకపోవడమే ఇందుకు కారణం. కొద్దిరోజులుగా మిల్లింగ్‌ జరగకపోవడంతో మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు పాడవుతున్నాయి. సంరక్షణ చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా ధాన్యం బస్తాలకు మొలకలు వస్తున్నాయి.

ధాన్యానికి మొలకలు
జియ్యమ్యవలసలోని ఓ రైస్‌ మిల్లులో ధాన్యానికి మొలకలు వచ్చిన దృశ్యం

  • మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు

  • స్పష్టత ఇవ్వని అధికారులు

  • ఆందోళనలో మిల్లర్లు

గరుగుబిల్లి, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైస్‌ మిల్లుల నుంచి బియ్యం నిల్వలు కదలడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీగా లేకపోవడమే ఇందుకు కారణం. కొద్దిరోజులుగా మిల్లింగ్‌ జరగకపోవడంతో మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు పాడవుతున్నాయి. సంరక్షణ చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా ధాన్యం బస్తాలకు మొలకలు వస్తున్నాయి. దీంతో మిల్లర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 121 రైస్‌ మిల్లులు.. 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను.. 2,44,196 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదనంగా 20 వేల మెట్రిక్‌ టన్నుల మేర మిగులు ధాన్యం కొనుగోలు చేశాయి. అయితే గోడౌన్లు ఖాళీలేక ఆ నిల్వలు మిల్లుల వద్దే దర్శనమిస్తున్నాయి.

జనవరి నుంచి మిల్లింగ్‌ కాలే..

జిల్లాలో ఖరీఫ్‌ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు.. బియ్యం నిల్వలు అందిం చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే గోడౌన్లు ఖాళీ లేవన్న నెపంతో అధికారులు మిల్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. మొత్తంగా జనవరి నుంచి మిల్లింగ్‌ కావడం లేదు. మరోవైపు ధాన్యం నిల్వలు పాడకుండా బస్తాలపై టార్పాలిన్లు కప్పి మిల్లర్లు రక్షణ చర్యలు చేపట్టారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని మిల్లుల్లో ఉన్న ధాన్యం బస్తాల నుంచి మొలకలు రావడంతో మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వలు పనికి రాని విధంగా మారడంతో లబోదిబోమంటున్నారు. కొద్ది రోజుల్లో మిల్లింగ్‌ జరగకుంటే ధాన్యం పూర్తిగా పాడవుతుందని, తాము తీవ్రంగా నష్టపోతామని వారు వాపోతున్నారు. అప్పులు చేసి బ్యాంకు గ్యారెంటీలు కట్టామని, ప్రస్తుతం గోడౌన్లు ఖాళీ లేక మిల్లులు ప్రాంతాల్లో ధాన్యం నిల్వలు దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు.

- వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు 15 రోజుల్లో బియ్యం నిల్వలు గా మార్చి గోడౌన్లకు అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ముందస్తుగా 65 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలించాలి. ఏడు శాతం బియ్యాన్ని పాఠశాలు, అంగన్‌వాడీలకు పంపించాలి. మిగిలిన 28 శాతం బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. అయితే గోడౌన్లు ఖాళీ లేక ఈ నిల్వలన్నీ ప్రస్తుతం మిల్లుల వద్దే ఉన్నాయి. ఎప్పుడు కదులుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు.

ఉన్నతాధికారులకు నివేదించాం

మిల్లర్లు సమస్యను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం బియ్యం నిల్వలకు ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా మిల్లింగ్‌కు అనుమతులు ఇవ్వలేదు. బియ్యం నిల్వల్లో కొంత పౌర సరఫరాలశాఖకు , మరికొంత ప్రభుత్వ పాఠశాలలకు అందించాల్సి ఉంది. మిల్లుల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే మిల్లింగ్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.

- కె.శ్రీనివాస్‌, మేనేజర్‌, పౌరసరఫరాలశాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Feb 06 , 2026 | 11:50 PM