చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:27 PM
చేనేత కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- ఘనంగా చేనేత దినోత్సవం
విజయనగరం, ఆగస్టు 7 ( ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ‘చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదే. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51,952 మందికి, జిల్లాలో 709 మంది చేనేత కార్మికులకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. మంగళగిరి, ధర్మవరం, పొందూరు వంటి చోట్ల తయారయ్యే చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండింగ్ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొందూరులో సెర్ప్ ఆధ్వర్యంలో కొత్తగా ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడుండే నూలుతోనే సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారు చేసేందుకు ప్రణాళిక ను రూపొందించాం.’అని అన్నారు. ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేత వృత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులకు రూ.3 వేలు రుణం ఇస్తే, చేనేత వస్త్రాల అమ్మకాలు అమాంతం పెరుగుతాయన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలను ధరించే అలవాటు పెరగాల్సి ఉందన్నారు. చేనేత రంగంలో ఉన్న యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. డీఆర్‌వో సత్తిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుందని అన్నారు. తొలుత మంత్రి చేనేత కార్మికులతో ముచ్చటించారు. రాట్నం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాట్నం తిప్పి వారిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో చేనేత జౌళీ ఏడీ పద్మ, రాష్ట్రపద్మశాలి సహకార సంఘ కన్వీనర్ ఎం.దేవేంద్రనాధ్, కొప్పలవెలమ కార్పొరేషన్ డైరక్టర్ ఎం.రవికుమార్, నేత కార్మికులు త్రినాఽఽథ్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రాసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు చేనేత వస్త్రాల వినియోగంపై చేనేత కార్మికులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు.
వైద్యకళాశాల పనులు పూర్తి చేస్తాం
ప్రభుత్వ వైద్యకళాశాల పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో నాబార్డు నిధులు మురిగిపోయాయని అన్నారు. ప్రస్తుతం సాస్కీ నిధులతో కొత్తగా పనులను ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల, ఆసుపత్రి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న సర్వజన ఆసుపత్రిని కూడా కొనసాగించేందుకు ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి తెలిపారు.