Share News

ప్రభుత్వ బడులు పిలుస్తున్నాయ్‌!

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:25 PM

జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రభుత్వ బడులు పిలుస్తున్నాయ్‌!
రాజాంలో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు(ఫైల్‌)

- జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌

- ర్యాలీలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులు

- ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా అవగాహన

రాజాం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి : జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బడి పిలుస్తోంది కార్యక్రమం పేరిట సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకూ 4 వేల మంది చిన్నారుల తల్లిదండ్రులను కలిసినట్టు అధికారులు చెబుతున్నారు. కచ్చితంగా గత ఏడాది కంటే విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన కొన్నిరోజులుగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. నేరుగా పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాల గురించి వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

- 2025-26లో ఒకటో తరగతిలో 18,957 మంది ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7,136 మంది మాత్రమే చేరారు. అందుకే ఈ ఏడాది స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులను చేర్చిందుకు ప్రయత్నిస్తున్నారు. అంగన్‌వాడీ చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఒకటో తరగతిలో చేర్పించేలా ప్రణాళికలు వేస్తున్నారు. బోధన, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ రాయితీలపై కరపత్రాలతో సహా తల్లిదండ్రులను కలిసి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో 1452 ప్రాథమిక, 319 ప్రాథమికోన్నత, 464 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 2,24,051 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అందుకే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

విశేష ఆదరణ..

జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ కొనసాగుతోంది. ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమగ్ర శిక్ష అధికారులు, సిబ్బంది, విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలతలు వస్తున్నాయి. ఎలాగైనా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

-మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

Updated Date - Apr 23 , 2026 | 11:25 PM