ప్రభుత్వ బడి భేష్
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:54 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు.
- ప్రైవేట్ స్కూళ్ల నుంచి చేరుతున్న విద్యార్థులు
- జిల్లాలో ఇప్పటికే 3 వేల మంది చేరిక
-ఫలితాలు ఇస్తున్న మంత్రి లోకేష్ నిర్ణయాలు
- ఈ విద్యా సంవత్సరం పెరుగుతున్న ప్రవేశాలు
-విద్యార్థులకు ఉపాధ్యాయుల వినూత్న స్వాగతం
- చేరిన వారికి సైకిళ్లు ఇచ్చిన ప్రధానోపాధ్యాయిని
- చీపురుపల్లి మండలం రామలింగపురం యూపీ పాఠశాల హెచ్‌ఎం గొర్లె పద్మావతి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముగ్గురు విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి అదే పాఠశాలలో 6వ తరగతిలో చేరారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం హెచ్‌ఎం వారికి రూ.16,500 విలువ చేసే మూడు కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి బుధవారం బహుమతిగా అందజేశారు. ఎంత మంది చేరినా సైకిళ్లు ఇస్తానని ఆమె ప్రకటించారు. ఇతర తరగతుల్లో చేరిన వారికి కూడా స్టీలు కంచాలు పంపిణీ చేశారు.
- పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 85 మంది విద్యార్థులు రాజాం మండలం బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం చేరారు. వీరికి ఉపాధ్యాయులు వినూత్నంగా బ్యాండు మేళంతో స్వాగతం పలికారు. విద్యార్థులపై పూలు చల్లారు.
- గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎనిమిది మంది విద్యార్థులు చేరారు. వీరంతా ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే. వీరికి విద్యా కమిటీ చైర్మన్ ఆవాల స్వామినాయుడు స్వాగతం పలికారు. వీరిని పాఠశాల సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు అభినందించారు.
విజయనగరం కలెక్టరేట్/రాజాం రూరల్/చీపురుపల్లి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, సదుపాయాలను చూసి వీటిల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను విడిచిపెట్టి సర్కారు బడుల్లో చేరుతున్నారు. బుధవారం ఒక్క రోజు 178 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకే కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అధికంగా యాప్‌లపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు అటువంటి విధానం లేదు. మరోవైపు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మోనూలో అనేక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు అందజేస్తున్నారు. మరోవైపు సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాఽధిస్త్తున్నారు. పదో తరగతిలో అత్యఽధిక మార్కులు సాఽధించిన వారికి ప్రోత్సాహాలు అందిస్తున్నారు. ఇవే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ హంగులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, చక్కని క్రీడా మైదానం వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాం, ఫీజులు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తుండడంతో వీటిని తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు.
సైకిళ్లు కొనిచ్చాను..
సర్కారు బడుల్లో పిల్లల ప్రవేశాలను పెంచడం కోసం ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీనిలో భాగంగా నా వంతుగా కృషి చేస్తున్నా. పిల్లలకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే వారు బడి పట్ల ఆకర్షితులవుతారన్న తలంపుతో గిఫ్టులు ప్రకటించాను. పేద పిల్లలకు సైకిళ్లు ఇవ్వడం వల్ల వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో చేరిన వారందరికీ సైకిళ్లు కొని ఇస్తానన్నాను. అదే చేశాను.
-గొర్లె పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు, ప్రాథమికోన్నత పాఠశాల, రామలింగపురం. చీపురుపల్లి
సమష్టి సహకారంతో
వివిధ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి ఇప్పటి వరకూ 85 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతిలో చేరారు. గత మూడు నెలలుగా ఉపాధ్యాయులంతా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వారి తల్లిదండ్రులకు వివరించాం. మీ పిల్లల చదువుకు మాది భరోసా అనే నమ్మకాన్ని కల్పించాం. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరింతమంది విద్యార్ధులు పాఠశాలలో చేరే అవకాశాలు ఉన్నాయి.
- గురుమూర్తి, హెచ్‌ఎం, జడ్పీహెచ్.స్కూల్, బొద్దాం, రాజాం
కార్పొరేట్ పాఠశాల నుంచి..
రాజాంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తిచేసిన మా అమ్మాయి చైత్రను బొద్దాం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేర్పించాను. ఉపాధ్యాయులిచ్చిన భరోసాతో, మా పాప అంగీకారంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
-వీరస్వామి, విద్యార్థిని తండ్రి, బొద్దాం
తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ఇక్కడ అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకు వేడి వేడి భోజనం అందిస్తున్నాం. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, షూ, టై, బెల్డ్ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ బడులే బాగున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారికి మా ఉపాధ్యాయులు స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్ధులు చేరే అవకాశాలు ఉన్నాయి.
-యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం