Share News

ప్రభుత్వ భూమి హాంఫట్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:30 PM

అవి సర్కారు భూములు. వాటి విలువ సుమారు రూ.25 కోట్లు.

   ప్రభుత్వ భూమి హాంఫట్‌
ప్రభుత్వ భూములను చదును చేసిన దృశ్యం

- కర్లాంలో 48 ఎకరాలు కబ్జా

- వాటి విలువ రూ.25 కోట్లు

- అందులోనే గెస్ట్‌ హౌస్‌, షెడ్‌ నిర్మాణం

- పొలాలకు వెళ్లే దారిని కప్పేసిన వైనం

- పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుకు సిద్ధమవుతున్న రైతులు

అవి సర్కారు భూములు. వాటి విలువ సుమారు రూ.25 కోట్లు. అంత ఖరీదైన 48 ఎకరాలపై భూవ్యాపారాలకు రా‘రాజు’గా ఉన్న ఓ బడా వ్యాపారవేత్త కన్ను పడింది. అంతే.. ఆగమేఘాల మీద చదును చేసి, ఫెన్సింగ్‌ వేసేశాడు. ఆక్రమించిన భూమిలో విలాసాల కోసం గెస్ట్‌ హౌస్‌, ఒక షెడ్డు కూడా నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా అటువైపు ఎవరూ రావడానికి వీలు లేని విధంగా... చివరికి పొలాలకు వెళ్లడానికి రైతులు వినియోగించే దారిని కూడా కప్పేసి ప్రహరీ కట్టేశాడు. చీపురుపల్లి- శ్రీకాకుళం ప్రధాన రోడ్డులో పత్తికాయవలస జంక్షన్‌కు కూత వేటు దూరంలో నెలల తరబడి ఈ తతాంగం సాగుతున్నా రెవెన్యూ యంత్రాంగం గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

చీపురుపల్లి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలుగా నమోదై ఉంది. ఆ భూముల్లో గతంలో ఎలాంటి పట్టాలు కూడా మంజూరు చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవే అని ఉన్నప్పటికీ, అక్కడ మాత్రం ఓ ప్రైవేటు వ్యక్తి దందా నడుస్తోంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. భూముల మధ్యలో గెస్ట్‌ హౌస్‌, ఒక షెడ్డు నిర్మించాడు. పత్తికాయవలస జంక్షన్‌ నుంచి నిమ్మలవలస, దేవరపొదిలాం, కర్లాం గ్రామాల్లోని రైతులు పొలాలకు వెళ్లాలంటే ఈ భూముల గుండానే నడవాలి. అయితే, ఈ భూముల చుట్టూ ఫెన్సింగ్‌, ప్రహరీ నిర్మించడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. దారికి ఆటంకం కల్పించడంపై వారు ప్రశ్నిస్తే.. ఈ భూములను తాను కొనుగోలు చేశానని, రెవెన్యూ రికార్డుల్లో నమోదు కానంత మాత్రాన తనవి కాకుండా పోతాయా అని సదరు వ్యక్తి తిరిగి ప్రశ్నిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ భూముల మీదుగా ఎటువంటి రహదారి లేదని చెబుతున్నాడని రైతులు వాపోతున్నారు. దీనిపై జిల్లా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడానికి కర్లాం, నిమ్మలవలస గ్రామాలకు చెందిన రైతులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

అవి ప్రభుత్వ భూములే

కర్లాంలోని సర్వే నంబర్‌ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మా వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు అవి గయాలుగా నమోదై ఉన్నాయి. నేటి వరకూ పట్టాలు కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఆక్రమణలు, భవనాల నిర్మాణంపై ఎటువంటి ఫిర్యాదు రాలేదు.

డి.ధర్మరాజు, తహసీల్దార్‌, చీపురుపల్లి.

Updated Date - Jun 05 , 2026 | 11:30 PM