Share News

Goodbye, See You Soon! బైబై వెళ్లొస్తాం!

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:20 AM

Goodbye, See You Soon! సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వచ్చిన వలస జీవులు పండుగ ముగియడంతో తిరుగుప్రయాణమవుతున్నారు. బతుకుదెరువు కోసం బరువెక్కిన హృదయంతో సొంత ఊరిని వదిలి సుదూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ‘

Goodbye, See You Soon! బైబై వెళ్లొస్తాం!
ప్రయాణికులతో రద్దీగా ఉన్న సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌

  • సంక్రాంతి ముగియడంతో బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు పయనం

  • కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

పార్వతీపురం/గరుగుబిల్లి/సాలూరురూరల్‌, జనవరి18(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వచ్చిన వలస జీవులు పండుగ ముగియడంతో తిరుగుప్రయాణమవుతున్నారు. బతుకుదెరువు కోసం బరువెక్కిన హృదయంతో సొంత ఊరిని వదిలి సుదూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ‘ బై.. బై.. వెళ్లొస్తాం’ అంటూ ఆప్తులకు వీడ్కోలు పలుకుతూ... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాలకు వేలాది మంది కూలీలతో పాటు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి వెళ్తున్నారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే సాలూరు, పార్వతీపురం, పాలకొండలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికు లతో కిటకిటలాడాయి. ముఖ్యంగా విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు రద్దీగా కనిపించాయి. చేతిలో సంచులు, కళ్లలో ఊరు విడిచి వెళ్తున్నామన్న దిగులుతో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా గత నాలుగు రోజుల పాటు వలస జీవులు, బంధుమిత్రుల పలకరింపులతో కళకళలాడిన పల్లెలు నేడు వారంతా పట్టణ, నగర బాట పట్టడంతో వెలవెలబోతున్నాయి. ఇదిలా ఉండగా.. జిల్లాలో మూడు ఆర్టీసీ కాంప్లెక్స్‌ల నుంచి 262 బస్సు సర్వీసులను నడిపారు. అయినప్పటికీ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. మరికొందరు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించి గమ్య స్థానాలకు చేరుకున్నారు.

బాధగా ఉంది..

మాది సాంబన్నవలస గ్రామం. పదేళ్ల కిందట ఉద్యోగరీత్యా హైదరబాద్‌ వెళ్లిపోయా. పెద్దల దీవెనల కోసం ఏటా సంక్రాంతికి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వస్తుంటా. ఏటాలనే ఈ సారికూడా సరదాగా పండుగ జరుపుకున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులను వదిలి ఉపాధి నిమిత్తం తిరిగి హైదరాబాద్‌ వెళ్లాలంటే బాధగా ఉంది.

- అక్కేన వెంకట సత్యనారాయణ, సాంబన్నవలస

Updated Date - Jan 19 , 2026 | 12:20 AM