Good scheme for hire education మంచి త‘రుణం’.. విద్యార్థులకు వరం
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:36 AM
Good scheme for hire education ఉన్నత విద్య అభ్యసించాలనుకునే యువతకు పీఎం విద్యాలక్ష్మి అండగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
మంచి త‘రుణం’.. విద్యార్థులకు వరం
ఉన్నత విద్యకు అండగా పీఎం విద్యాలక్ష్మి
ఎలాంటి హామీ లేకుండానే రుణం
వడ్డీ రాయితీకి అవకాశం
రాజాం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య అభ్యసించాలనుకునే యువతకు పీఎం విద్యాలక్ష్మి అండగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక, ఉన్నతవిద్య మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఇండియన్ బాంక్ అసోసియేషన్ (ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను రూపొందించాయి. విద్యార్థులకు 90 రకాల విద్యారుణాలను అందిస్తూ వారి కలలను సాకారం చేస్తున్నాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నతంగా చదువుకోవాలన్న ఆకాంక్ష ఉండి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణ సహాయం అందుతుంది.
- పీఎం విద్యాలక్ష్మి పథకం కింద రూ.10 లక్షల వరకూ ఎలాంటి హామీ లేకుండా రుణం మంజూరు చేస్తారు. వార్షిక ఆదాయం రూ.9 లక్షలలోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ.10 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండడంతో బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. కేవలం ట్యూషన్ ఫీజుకే కాకుండా హాస్టల్, పరీక్ష, ల్యాబ్, పుస్తకాలు, విద్యాసామగ్రికి కూడా రుణాన్ని వినియోగించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
రుణం కావాలనుకునేవారు. విద్యాలక్ష్మి పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో బ్యాంకుల రుణ పథకాలు పొందుపరిచారు. వాటిని పరిశీలించి నచ్చిన బ్యాంకుకు దరఖాస్తు పంపొచ్చు. ఎంచుకున్న బ్యాంకులో అకౌంట్ ఓపెన్‌చేసి వివరాలు పొందుపరచాలి. విద్యారుణం ఫారం ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు ప్రోగ్రెస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.
వీరంతా అర్హులే..
మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా, టెక్నికల్, శాస్ర్తీయ కోర్సులు, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులు, సీఏ, సీఎస్, ఎంఏతో పాటు డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దేశంలోని 800 ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం పొంది ఉండాలి. గరిష్ఠంగా రూ.7.50 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.
గడువు తేదీ లేదు...
మూడు విభాగాలలో రుణం ఇస్తారు. రూ.4 లక్షల లోపు, రూ.4 లక్షల నుంచి రూ.7.50 లక్షలు, రూ.7.50 నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు మంజూరు చేస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సు ఫీజుకు అనుగుణంగా రుణం ఎంపిక చేసుకోవచ్చు. గడువుతేదీ లేదు. ఒక విద్యార్థి ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
----------------