విద్యార్థులకు తీపికబురు
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:53 PM
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.
- డైట్ చార్జీలు 10 శాతం పెంచిన ప్రభుత్వం
- జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం
పాలకొండ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి చెల్లించే డైట్ (మెనూ) చార్జీలను 10 శాతం పెంచింది. దీనివల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, అల్పాహారం అందుతుందని భావిస్తుంది. 2023 నుంచి ఇప్పటివరకు డైట్ చార్జీలు పెంచలేదు. దీంతో అనుకున్న స్థాయిలో విద్యార్థులకు పౌష్టికాహారం అందేదికాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు మెరుగైన మెనూ అందించే అవకాశం ఉంది. పెంచిన చార్జీలు ఈ నెల నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా వ్యాప్తంగా 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 32, బాలికలు 15 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12,970 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, యూఆర్‌జేసీలు, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మినీ గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో 5,530 మంది, సీతంపేట ఏజెన్సీలోని 18 ఆశ్రమ పాఠశాలల్లో 4,806 మంది, నాలుగు పోస్టుమెట్రిక్, ఎనిమిది గురుకులాలు, ఒక ఏకల్య స్కూల్‌లో 2,970 మంది, తొమ్మిది బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 400 మంది, ఆరు పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో 300 మంది, ఎనిమిది ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో 610 మంది, ఐదు ఎస్సీ పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో 320 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పెంచిన మెనూ చార్జీలతో వీరందరికీ ప్రయోజనం కలగనుంది.
పెరిగిన మెనూ చార్జీలు ఇవే...
ప్రస్తుతం సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో 3,4 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,150 చొప్పున డైట్ చార్జీల కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. 10 శాతం పెంపుతో ఈ మొత్తం రూ.1,265కు చేరుతుంది. 5 నుంచి పదో తరగతి వరకు ఒక్కొ విద్యార్థికి ప్రస్తుతం రూ.1400 చెల్లిస్తుండగా, పెంచిన చార్జీలతో రూ.1540కు చేరింది. ఇంటర్, డిగ్రీ ఆపై విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రస్తుతం రూ.1,600 ఇస్తుండగా, పెంచిన చార్జీల ప్రకారం రూ.1760కు చేరుతుంది.