Good News for Employees ఉద్యోగులకు శుభవార్త
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:39 AM
Good News for Employees ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. వేతన సవరణ (పీఆర్సీ) ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం అమరావతిలో వివిధ జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
డీఏ, సరెండర్ లీవ్‌లకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
జిల్లాలో 20,790 మందికి లబ్ధి
ఉద్యోగ సంఘాలు హర్షం
పార్వతీపురం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. వేతన సవరణ (పీఆర్సీ) ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం అమరావతిలో వివిధ జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అక్టోబరు 1 నుంచి రెండు డీఏలు చెల్లించాలని, 2022 నాటి సరెండర్ లీవ్‌లు వచ్చే ఏడాది జనవరిలో ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్వతీపురంలో ఏపీ ఎన్‌జీవో సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు ‘ థాంక్యూ సీఎం సార్’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చి సందడి చేశారు.
20,790 మందికి లబ్ధి
ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సుమారు 20,790 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. వారిలో 14 వేల మందిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. రెండు డీఏలు మంజూరు వల్ల ఒక్కో ఉద్యోగికి జీతం ఆధారంగా సుమారు రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు అందనుందని ప్రాథమిక అంచనా. అదే విధంగా ఒక అదనపు సరెండర్ లీవ్ మంజూరు చేయడం వల్ల మన్యంలో 765 మంది పోలీసులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్లకు పూర్వపు అడిషనల్ క్వాంటం పెన్షన్ అమలు వల్ల సుమారు 6025 మందికి మేలు జరగనుంది.
ఆనందంగా ఉంది..
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 12లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యలపై సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. ఆయనతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఎంతో ఆనందంగా ఉంది. పీఆర్సీ ఏర్పాటు, రెండు డీఏలు, ఒక సరెండ్ లీవ్ మంజూరు, పోలీసులకు అదనపు సరెండర్ లీవ్, పెన్షనర్లకు పూర్వపు అదనపు క్వాంటమ్ పెన్షన్ అమలు తదితర అంశాలపై ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హెల్త్‌కార్డుల నెలవారీ చందాను ట్రస్టుకు అప్పగించడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లుకు పెంచడం వంటి నిర్ణయాలను స్వాగతించారు. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై త్వరలో ప్రభుత్వం శుభవార్త ప్రకటిస్తుందని భావిస్తున్నాం.
- జీవీఆర్‌ఎస్ కిషోర్, జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు
=========================================
హర్షణీయం
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఎంతోమంది ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు మేలు జరగనుంది.
- అమరాపు సూర్యనారాయణ, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు