Cashew Farmers జీడి రైతులకు తీపికబురు
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:47 PM
Good News for Cashew Farmers జీడి రైతులకు రాష్ట్ర ఉద్యానవనశాఖ తీపి కబురు చెప్పింది. 2026-27 సంవత్సరానికి గాను జీడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తెగుళ్లు, పొగమంచు, ఇతర సమస్యల మూలంగా పంట నష్టపోతే పరిహారం చెల్లిస్తామని భరోసా కల్పించింది. దీంతో జీడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 65 వేల ఎకరాల్లో జీడి తోటలున్నాయి.
ఎకరాకు రూ.1,500 నుంచి రూ.1,600 ప్రీమియం చెల్లించాలి
జిల్లాలో 65 వేల ఎకరాల్లో తోటలు
మక్కువ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జీడి రైతులకు రాష్ట్ర ఉద్యానవనశాఖ తీపి కబురు చెప్పింది. 2026-27 సంవత్సరానికి గాను జీడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తెగుళ్లు, పొగమంచు, ఇతర సమస్యల మూలంగా పంట నష్టపోతే పరిహారం చెల్లిస్తామని భరోసా కల్పించింది. దీంతో జీడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 65 వేల ఎకరాల్లో జీడి తోటలున్నాయి. గుమ్మలక్ష్మీపురం, సాలూరు, మక్కువ, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, సీతంపేట, పాచిపెంట తదితర మండలాల్లో పంట సాగవుతోంది. ఈ ఏడాది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎకరా జీడితోటకు రైతులు కేవలం రూ.1,500 నుంచి రూ.1,600 వరకు ప్రీమియంను ఈ నెల 15లోగా చెల్లించాలి. బీమా చేసేందుకు ఈ సంవత్సరం టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. ఫసల్ బీమా యోజన యాప్ ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బీమా ప్రీమియం చెల్లించేందుకు రైతులకు అవకాశం ఇచ్చారు. 1బీతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, సెల్‌ఫోన్ నెంబరు, ఫొటో వంటివి అందించాల్సి ఉంటుంది. బీమాను సద్వినియోగం చేసకోవడం ద్వారా రైతులు పెద్దఎత్తున లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మండల ఉద్యావన శాఖ అధికారి ప్రత్యూషను వివరణ కోరగా.. మక్కువ మండలంలో 1800ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయని తెలిపారు. బీమా చేసుకున్న రైతులకు ఆర్థిక భరోసాతో పాటు పంటలకు రక్షణ కలుగుతుందన్నారు. ఈనెల 15 లోపు జీడిరైతులు బీమా చేసుకోవాని సూచించారు.