Anganwadi Workers అంగన్‌వాడీలకు తీపికబురు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:03 AM
Good News for Anganwadi Workers అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో సర్వత్రా హర్షం
పాలకొండ, జూలై17(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలో అంగన్‌వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో పది ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 74 సెక్టార్లు ఉన్నాయి. వాటి పరిధిలోని కేంద్రాల్లో 2,600 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పని చేస్తున్నారు. మినీ కేంద్రాల్లో 650 మంది కార్యకర్తలు ఉన్నారు. మొత్తంగా 3,250 మంది అంగన్‌వాడీలకు తల్లికి వందనం పథకం వర్తించే అవకాశం ఉంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పిల్లలకు తల్లికి వందనం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు అమరవేణి, హిమప్రభ తెలిపారు. ప్రభుత్వం ‘మా సమస్యను గుర్తించి మా పిల్లలకు పథకం’ వర్తించేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని వారు చెప్పారు. అయితే దీనిపై ఉత్తర్వులు రావల్సి ఉందని ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తెలిపారు.
- జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగత వరకు లక్షా 3 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారితో పాటు అంగన్‌వాడీల పిల్లలకు కూడా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున జమ చేయనుంది. ఇందు కోసం జిల్లాకు సుమారు రూ.154 కోట్లు విడుదల చేయనుంది.
ఎన్‌పీసీఐతో అనుసంధానం తప్పనిసరి
పార్వతీపురం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం వర్తించాలంటే బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐతో అనుసంధానం తప్పనిసరి అని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత అధికారి ఎం.శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐతో ఈ నెల 20లోగా అనుసంధానం చేసుకోవాలని సూచిం చారు. బ్యాంకు ఖాతాలేని వారు సమీప పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచిన వెంటనే ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవాలన్నారు. లేకపోతే ఈనెల 22న విడుదలయ్యే ‘తల్లికి వందనం’ నగదు జమకాదని పేర్కొన్నారు.