Never to Return ఆటకని వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:35 AM
Gone to Play… Never to Return ఆటకని బయటకు వెళ్లిన ఇద్దరు బాలురు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. చెరువు గుంతలో మునిగి మృతి చెందారు. అప్పటివరకు ఆడుతూ.. పాడుతూ కనిపించిన తమ బిడ్డలు ఇక లేరని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
గుమ్మలక్ష్మీపురం, మార్చి16(ఆంధ్రజ్యోతి): ఆటకని బయటకు వెళ్లిన ఇద్దరు బాలురు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. చెరువు గుంతలో మునిగి మృతి చెందారు. అప్పటివరకు ఆడుతూ.. పాడుతూ కనిపించిన తమ బిడ్డలు ఇక లేరని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్కగూడకు చెందిన గౌడు శుభో (9), గౌడు హర్ష (9) అదే గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వారిద్దరిదీ ఇరుగుపొరుగు ఇళ్లులే. స్నేహితులైన వారు రోజూలానే సోమవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఐడు గంటలకు బయటకు వచ్చి కాసేపు సరదాగా ఆడుకున్నారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువులో స్థానానికి వెళ్లారు. అందులో వారు స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ చెరువు గుంతలో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని విద్యార్థులను బటయకు తీశారు. అయితే వారిలో శుభో అక్కడికక్కడే చనిపోయాడు. హర్షను భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తుండగా... మార్గమధ్యంలో చనిపోయాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురుయ్యారు. చెరువు వద్ద విగతజీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి భోరున విలపించారు. ఇంటికి పెద్ద కుమారులైన వారి మృతిని తట్టుకోలేక.. గుండెలవిసేలా రోదించారు. గౌడు శుభో తల్లిదండ్రులు రాము, సులోచన , గౌడు హర్ష తల్లిదండ్రులు లిటో, షర్మిల వ్యవసాయంతో పాటు పాలు విక్రయించుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే తమ బిడ్డల మృతిని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎల్విన్‌పేట ఎస్‌ఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలురు మృతదేహాలను భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.