యాతపేటలో బంగారం చోరీ
ABN , Publish Date - May 18 , 2026 | 11:58 PM
చల్లవానితోట పంచాయతీలో గల యాతపేటలో ఆదివారం జరిగిన చోరీలో పెద్దఎత్తున బంగారం పోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పూసపాటిరేగ, మే 18(ఆంధ్రజ్యోతి): చల్లవానితోట పంచాయతీలో గల యాతపేటలో ఆదివారం జరిగిన చోరీలో పెద్దఎత్తున బంగారం పోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలో నివాసం ఉంటున్న రీసు రామారావు అనే వ్యక్తి ఇంటిలో ఈ చోరీ జరిగింది. వృత్తిరీత్యా కల్లుగీత కార్మికులు కావటంతో రామారావు తల్లిదండ్రులు కల్లుగీతకు వెళ్లారు. భార్య రీసు రాజు వేరే ప్రాంతానికి పనిపై వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి బెడ్‌రూం తలుపుతోపాటు లోపలి బీరువా తాళాలు పగలకొట్టి ఉన్నాయి. బీరువాలో దాచుకున్న ఆరు బంగారుగాజులు, 2 హారాలు, నల్లపూసలతాడు ఒకటి, నాలుగు ఉంగరాలు, మండగొలుసు ఒకటి చోరీ అయినట్టు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వస్తువులు మొత్తం 25తులాలు ఉంటాయని తెలిపారు. వీటి వలువ రూ.30లక్షలకు పైనే ఉంటాయన్నారు. స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మంగళపాలెంలో..
కొత్తవలస, మే 18(ఆంధ్రజ్యోతి): మంగళపాలెం గ్రామ సమీపంలోని కొత్తవలస-విశాఖపట్టణం రోడ్డులో ఉన్న మాకెన నరసింహాచార్యపాత్రుడు(బంగ్లా పాత్రుడు) ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీనిపై కొత్తవలస సీఐ టీవీ విజయ్‌కుమార్ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లా పాత్రుడు గతంలో మృతిచెందడంతో ఆ ఇంటికి తాళం వేసి, కుమారులు అప్పడప్పుడు వచ్చి వెళ్తుంటారు. పాత్రుడి కుమారుడు రాజేశ్వరప్రసాద్ ఈనెల 16న మంగళపాలెంలోన్ను ఈ ఇంటికి వచ్చి చూడగా.. ఇంట్లో ఉన్న బంగారం, వెండి వస్తువులు చోరీ అయినట్టు గుర్తించారు. సుమారు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు కిలో వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ.8లక్షలు ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేయడానికి కూడా ఇష్టపడకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు తామే కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.