Share News

gold rates very hike పసిడి పైపైకి..

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:59 PM

gold rates very hike పసిడి ధర అమాంతం పెరిగిపోయింది. పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ఏకంగా రూ.1,58,000కు చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. గత నాలుగేళ్లతో పోల్చితే బంగారం ధర 200 శాతం పెరిగింది.

gold rates very hike పసిడి పైపైకి..

పసిడి పైపైకి..

పది గ్రాముల బంగారం రూ.1.58 లక్షలు

అదేబాటలో వెండి.. కిలో రూ.3.28 లక్షలు

ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు

విజయనగరం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పసిడి ధర అమాంతం పెరిగిపోయింది. పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ఏకంగా రూ.1,58,000కు చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. గత నాలుగేళ్లతో పోల్చితే బంగారం ధర 200 శాతం పెరిగింది. 2020లో పదిగ్రాముల బంగారం రూ.40వేలు ఉండగా ప్రస్తుతం రెండింతల రెట్టింపు అయింది. బంగారం మీద పెట్టుబడి పెట్టినవారికి భారీగా కలిసొచ్చింది. రెండు నెలలుగా బంగారం ధర పెరుగుతూ ఉంది. గత ఏడాది జూలైలో పదిగ్రాముల ధర రూ.1,10,000 ఉండగా, రెండు నెలల్లో గ్రాముకు రూ.వెయ్యికిపైగా పెరిగింది. గత ఏడాది అక్టోబరు 20 నాటికి పది గ్రాములు రూ.1,30,000కి చేరింది. కొద్ది రోజులుగా హెచ్చుతగ్గుతూ ఉన్న బంగారం ధర ఈఏడాది ఒకటో తేదీ నుంచి గ్రాముకు రూ.500 వరకు పెరుగుతూ బుధవారం నాటికి పదిగ్రాములు 1,58,000 మార్కు దాటి తారాస్థాయికి చేరింది.

- బంగారం బాటలో వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.3,28,000కు చేరింది. ఏడాది కిందట కిలో వెండి రూ.90వేలు ఉండగా నాలుగురెట్లు ధర పెరిగింది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బులియన్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెరగడం మూలంగా బంఽగారం ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

- జిల్లా కేంద్రమైన విజయనగరంలో 135 నగల షాపులు ఉండగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో 323 షాపులు నడుస్తున్నాయి. విజయనగరం బులియన్‌ మార్కెట్‌ పసిడికు పెట్టిందిపేరు. నిత్యం కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుంది. దీంతో పెద్ద, పెద్ద షోరూంలు విజయనగరంలో వెలిశాయి. బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌.కోట, చీపురుపల్లి, రాజాం తదితర ప్రాంతాల్లోనూ బంగారం వ్యాపారం ఇటీవల కాలంలో జోరందుకుంది. జిల్లాలో నిత్యం రూ.2కోట్లు పైగా వ్యాపారం సాగుతుంది. ధరలు పెరుగుతుండటంలో వ్యాపారాలు సాగడం లేదని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండటంతో వ్యాపారాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక బంగారం బాటలో వెండి కూడా ప్రయాణిస్తోంది. కిలో వెండి ధర రూ.3,28000లకు చేరింది. ఏడాది క్రితం కిలో వెండి రూ.90వేలు ఉండగా నాలుగురెట్లు పెరిగింది.

ఒక్కరోజులోనే..

- మంగళవారం పది గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.1,48,300 ఉండగా.. బుధవారం ఒక్కరోజే పదిగ్రాములపై రూ.9,500కుపైగా పెరిగింది.

- ఇక వెండి మంగళవారం కిలో రూ.3 లక్షలు ఉండగా.. బుధవారం నాటికి రూ.3,24,000కి చేరింది. ఒక్కరోజులోనే కిలోకు రూ.24వేలు పెరిగింది.

పసిడి ధరలు ఇలా

============

సంవత్సరం పది గ్రాములు

1910 రూ.15.50

1920 రూ.18.25

1930 రూ.18.05

1940 రూ.36

1950 రూ.99

1960 రూ.111.56

1970 రూ.184.50

1980 రూ.1330

1990 రూ.3,200

2000 రూ.4,400

2010 రూ.18,500

2020 రూ.40,000

2023 రూ.56,700

2024 రూ.80,000

2025 రూ.83,000

2026 రూ.1,58,000

ఎన్నడూ చూడలేదు

ఎ.రమ్యశ్రీ, గృహిణి

బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడలేదు. అమ్మాయి పెళ్లికి బంగారం కొనుగోలు చే యాల్సి ఉంది. ఐదు తులాలు కొనాలి. పెరిగిన ధరల ప్రకారం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వ్యయం అవుతుంది. దీంతో టెన్షన్‌ పడాల్సి వస్తోంది. నాలాంటి వారు చాలా మంది ఈ విధంగానే బాధపడుతున్నారు. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందనిస్థాయిలో బంగారం పెరగడం బాధాకరం.

సామాన్యులు నగలను తాకలేరేమో

తిరుపతమ్మ, ప్రభుత్వ ఉపాధ్యాయని, బొబ్బిలి

బంగారం, వెండి ధరల దూకుడు చూస్తుంటే సగటు గృహిణిలు, సామాన్యులు వాటిని కనీసం తాకలేరేమో. ఇప్పటికే చాలా మంది మధ్యతరగతి కుటుంబాల వారు ఫంక్షన్లలో చిన్నబోకుండా ఉండాలన్న కోరికతో గిల్ట్‌ నగలను పెట్టుకొంటున్నారు. ఇక శాశ్వతంగా వాటిపైనే ఆధారపడకతప్పదు. బంగారం ధరలకు కళ్లెం పడుతుందనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది.

వరల్డ్‌ ఎకానమీ ప్రభావమే

గ్రంథి బాబు, బొబ్బిలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలే బంగారం, వెండి ధరల దూకుడుకు ప్రధాన కారణం. ఆయన ఏకపక్షంగా పలుదేశాలపై పన్నులను పెంచుతుండడంతో వరల్డ్‌ ఎకానమీ అస్తవ్యస్తంగా తయారైంది. డాలర్‌ విలువ అమాంతం పెరిగిపోయింది. బంగారం ధరలో వెండి ధర పదిశాతం ఉండాలి. కిలో వెండి ధర నాలుగు లక్షల నుంచి ఇంకా పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు.

------------------

Updated Date - Jan 21 , 2026 | 11:59 PM