Gold on the Ris పసిడి పరుగు.. పనులు కరువు
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:39 PM
Gold on the Rise, Jobs on the Decline పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో జిల్లాలో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు. పనుల్లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవానికి బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినా.. భారీగానే ఉన్నాయి. తాజాగా మంగళవారం మళ్లీ వాటి ధరలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు బెంబేలెత్తిపోతున్నారు.
తగ్గిన కొనుగోళ్లు
ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులు
పాలకొండ, ఫిబ్రవరి3(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో జిల్లాలో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు. పనుల్లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవానికి బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినా.. భారీగానే ఉన్నాయి. తాజాగా మంగళవారం మళ్లీ వాటి ధరలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది వరకు పసిడి గ్రాము ధర రూ.7 వేలు ఉండేది. గడిచిన ఆరు నెలల్లో చూసుకుంటే భారీగా ధర పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.16 వేల పైనే ఉంది. అదేవిధంగా గతేడాది వెండి కిలో ధర రూ.లక్షా 50 వేలు ఉండగా, గడిచిన ఆరు నెలల్లో దీని ధర రూ.3 లక్షల వరకు పెరిగింది. మొత్తంగా మార్కెట్లో వాటి కొనుగోళ్లు తగ్గాయి. ఈ క్రమంలో బంగారు వస్తువుల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న స్వర్ణకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషిస్తుంచుకుంటూ వలస బాట పడుతున్నారు. పొట్టచేతపట్టుకుని పనుల కోసం ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు వెళ్తున్నారు. మరికొందరు విధిలేని పరిస్థితుల్లో అదే వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వృత్తిపై ఆధారపడి సుమారు నాలుగు వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. బంగారు ఆభరణాలు విక్రయించే దుకాణాల్లో మరో రెండు వేల మంది పనులు చేస్తున్నారు. ఒకవైపు బంగారం, వెండి ధరలు , మరోవైపు మార్కెట్లో కార్పొరేట్ జ్యూయలరీ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తుండడంతో స్వర్ణకారులను ఆశ్రయించి ఆభరణాలు చేయించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తంగా గడిచిన ఆరు నెలలుగా పనుల్లేకపోవడంతో స్వర్ణకారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈనెల 15 తర్వాత శుభ ముహూర్తాలు ఉండడంతో కాస్తయినా పనులొచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఏదేమైనా బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతోనే ఉపాధి కోల్పో యామని, కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృత్తిని వదులుకోలేకపోతున్నాం..
ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో మేమంతా ఉపాధి కోల్పోయాం. బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గింది. మా వద్ద ఎవరూ ఆభరణాలు తయారు చేయించుకోవడం లేదు. పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ నమ్మిన వృత్తిని వదులుకోలేక దుకాణాల వద్దనే ఉంటున్నాం.
- టేకు రామకృష్ణాచార్యులు, స్వర్ణకారుడు, పాలకొండ
=====================================
ఇబ్బందులు పడుతున్నాం..
బంగారం, వెండి ధరల పెరుగుదలతో స్వర్ణకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. ధరలు పెరుగు తుండడంతో పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
- కర్రి శ్రీనివాసరావు, స్వర్ణకార సంఘ పట్టణ కార్యదర్శి, పార్వతీపురం టౌన్