Share News

బంగారమే టార్గెట్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:05 AM

బంగారం ధరలు పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు.

బంగారమే టార్గెట్‌

- జిల్లాలో వరుస దొంగతనాలు

- ధర పెరగడంతో రెచ్చిపోతున్న దొంగలు

- కేసులకే పరిమితమవుతున్న పోలీసులు

- రికవరీలు అంతంత మాత్రమే

శృంగవరపుకోట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): బంగారం ధరలు పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇళ్లల్లోకి చొరబడి బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారు. చైన్‌ స్నాచింగ్‌లకు సైతం పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో ఎక్కువయ్యాయి. దీంతో ఇళ్లల్లో బంగారం ఉంచాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిఘా పటిష్టంతో పాటు గస్తీ ముమ్మరం చేసినట్టు పోలీసులు చెబుతున్నా.. దొంగతనాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కేసులు కట్టడం.. అరెస్టులు చేయడం వరకే పోలీసులు పరిమితం అవుతున్నారని, సొత్తును రికవరీ అంతంత మాత్రంగానే ఉంటుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని ఉదాహరణలు..

గత నెల రాజాంలోని రెండు అపార్ట్‌మెంట్లలో దొంగతనం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన ప్లాట్లలోకి దొంగలు చొరబడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఓ వైద్యుడు ఇంటిలోని 1250 గ్రాముల బంగారం, కిలో వెండి, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇంటిలో 291 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. ఈ రెండు ఇళ్లలో పోయిన బంగారం కేజీన్నర వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ దాదాపు రూ.3కోట్ల వరకు ఉంటుంది.

గత నెల వేపాడ మండలం బొద్దాం గ్రామంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భార్యాభర్త ఉదయాన్నే పొలానికి వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఆ ఇంటిలోకి ప్రవేశించారు. చెక్క కబోర్డులో ఉన్న 35తులాల బంగారు ఆభరణాలు, మూడు తులాల వెండి వస్తువులను దోచుకెళ్లారు.

గతేడాది ఏప్రిల్‌ 27న శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామ శివారులో ఉన్న ఇంటిలో పట్టపగలే దొంగతనం జరిగింది. 21 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. ఆ ఇంట్లో ఉన్న వారంతా పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దొంగలు ఆ ఇంటి వెనుకభాగంలోని డోరు, కిటికీలను బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. రెండు బీరువాల్లో దాచిన నగలను చోరీ చేశారు.

గతేడాది మే 27న అర్ధరాత్రి సమయంలో కొత్తవలస మండలం మంగళపాలెంలోని ఓ ఇంటిలో దొంగలు పడ్డారు. 90 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.5లక్షల నగదును కాజేశారు. ఇంటిళ్లపాది పైఅంతస్థులో నిద్రపోతుండగా దొంగలు చోరీకి తెగబడ్డారు. మరుసటి రోజు తెల్లవారుజామున నిద్ర లేచిన ఇంటి యజమాని కిందకు వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించాడు.

Updated Date - Mar 07 , 2026 | 12:05 AM