పసిడి, వెండి పరుగులు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:16 AM
పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకూ వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
- పది గ్రాముల బంగారం రూ.1,58,950
- ఒకరోజులోనే రూ.6,950పెరుగుదల
- ఇదే బాటలో వెండి
- కేజీ రూ.3.28లక్షలు
సాలూరురూరల్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకూ వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం పదిగ్రాముల (24 క్యారెట్లు) బంగారం రూ.1,58,950 పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఒకరోజులోనే రూ.6,950 పెరిగింది. 2020లో పదిగ్రాముల ధర రూ.40వేలు ఉండగా ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ.3.28లక్షలు పలుకుతోంది. ఈ ధరలను చూసి ఉమ్మడి జిల్లాలోని కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
ధరలు ఇలా..
ఉమ్మడి జిల్లాలో బుధవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.1,58,950 (తులం ధర రూ.1,85,390), 22 క్యారెట్లు పది గ్రాములు రూ.1,43,550 (తులం రూ.1,67,430)గా ఉంది. సోమవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.1,48,650, మంగళవారం రూ.1,52,000 ఉండగా బుధవారం రూ.1,58,950కు చేరింది. అంటే ఒకరోజులో రూ.6,950పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు సోమవారం రూ.1,33,550, మంగళవారం రూ.1,39,800 ఉండగా బుధవారం రూ.1,43,550కు చేరింది. ఒకరోజులో రూ.3,750 పెరిగింది. వెండి కిలో సోమవారం రూ.3,04,795, మంగళవారం రూ.3,20,000లుగా ఉండగా ప్రస్తుతం రూ.3,28,000కు చేరింది. రెండు రోజుల్లో వెండి రూ.23,205 పెరిగింది. ట్రంప్ సుంకాల ప్రభావం, ట్రంప్ యూరోపియన్ దేశాలను బెదరించడం, డాలర్‌తో రూపాయి క్షీణత, పారిశ్రామిక రంగం నుంచి బంగారం, వెండికి డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుగులు వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయని వ్యాపార నిపుణులు అంటున్నారు.
కొనుగోలుదారుల్లో ఆందోళన
వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడంతో బంగారం, వెండి కొనుగోలు తప్పనిసరి. ప్రస్తుతం శుక్రమౌఢ్యమి కొనసాగుతుండడంతో పెళ్లిలో కీలకమైన శతమానం (పుస్తెలు) కొనుగోలుకు సైతం సందేహిస్తారు. బంగారం, వెండి కొనుగోలుకు జాప్యం చేసే కొద్దీ వాటి ధరలు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రూ.850 కోట్లకు పైబడే నెలకు బంగారు,వెండి లావాదేవీలు జరిగే అవకాశముందని ఒక అంచనా. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కొనుగోలు తగ్గాయి..
బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశముంది. ర్యాలీ తగ్గడానికి అవకాశాలు కుదరడం లేదు. వీటి ధరలు పెరగడం వల్ల కొనుగోలు బాగా తగ్గాయి. ధరలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. పెట్టుబడిగా భావిస్తే మార్కెట్‌ను పరిశీలించి కొనుగోలు చేయాలి. శుభకార్యాలకు కొనుగోలు చేసే వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.
-సుతాపల్లి వీరవెంకటరావు, అధ్యక్షుడు, సాలూరు బంగారం, వెండి వర్తక సంఘం