Share News

going to the secretariats with happy movements సచివాలయాలకు ఉత్సాహంగా..

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:36 AM

going to the secretariats with happy movements

going to the secretariats with happy movements సచివాలయాలకు ఉత్సాహంగా..
కల్లేపల్లిలో పింఛన్ల నమోదుకు క్యూలో అర్హులు

సచివాలయాలకు ఉత్సాహంగా..

సామాజిక పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తొలిరోజు కోలాహలం

పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు

మూడేళ్ల తరువాత మంజూరు తంతు

విజయనగరం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి):

పింఛను కోసం ఎదురుచూస్తున్న వారి మొహాల్లో ఆనందం కనిపించింది. దరఖాస్తు చేసేందుకు సచివాలయాలకు బారులుతీరారు. తొలిరోజు ప్రతిచోటా కోలాహలం నెలకొంది. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, దివ్యాంగ పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తొలిరోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏ సచివాలయం చూసినా అభ్యర్థులతో నిండిపోయింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 16 వరకూ కొనసాగనుంది. 17 నుంచి 21 వరకూ ఐదురోజుల పాటు అర్హతల తనిఖీ, క్షేత్రస్థాయి పరిశీలన, వృత్తిపరమైన పింఛన్ల తనిఖీ జరగనుంది. ఈ నెల 22 నుంచి 24 వరకూ ఎంపీడీవో/మునిసిపల్‌ కమిషనర్‌/జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలన ఉంటుంది. ఈ నెల 25 నుంచి 26 వరకూ బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం తెలియజేస్తారు. అక్టోబరు 1న అర్హులందరికీ పింఛన్‌ మొత్తం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో 777 పంచాయతీలు, నగర పాలక సంస్థ, పట్టణాలు కలిపి 590 సచివాలయాలు ఉన్నాయి. దాదాపు గ్రామ/వార్డు సచివాలయాల్లో అన్నిచోట్ల దరఖాస్తుదారులతో కార్యాలయాలు రద్దీగా మారాయి. గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. చివరిగా వైసీపీ హయాంలో 2023లో పింఛన్లు మంజూరయ్యాయి. తరువాత కనీసం స్పౌజ్‌ పింఛన్లు కూడా మంజూరుకాలేదు. కూటమి వచ్చిన తరువాత భర్త పింఛనుదారుడైతే చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్‌ వర్తించేలా స్పౌజ్‌ పింఛన్‌ మంజూరు చేసింది. 2024 జూన్‌లో కూటమి అధికారంలోకిరాగా.. 2023 డిసెంబరు నుంచి స్పౌజ్‌ పింఛన్లకు మోక్షం కలిగించింది. భర్త పింఛన్‌దారుడై ఉండి చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్‌ వర్తించేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు నేరుగా అన్నిరకాల సామాజిక పింఛన్లకు మోక్షం కలిగించింది.

జిల్లాలో ఏడు వేల మందికి పైగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నట్టు గణాంకాలు తెలియ జేస్తున్నాయి. అయితే అన్నిరకాల పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడంతో రెట్టింపు ఉత్సాహంతో అర్హులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా అంతటా పింఛన్ల సందడి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో 2,66, 322 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.114కోట్ల 15 లక్షలను ఫించన్‌ల కోసం ఖర్చు చేస్తున్నారు. సోమవారం నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా జిల్లాలో మరో పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.

నెమ్మదించిన సర్వర్‌

రాజాం/లక్కవరపుకోట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్లకు దరఖాస్తు ప్రక్రియలో తొలిరోజు సోమవారం సర్వర్‌ మొరాయించడం, ఆధార్‌ ఓటీపీలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొన్ని సచివాలయాల్లో కనీసం పది దరఖాస్తులు కూడా అప్లోడ్‌ కాలేదు. అయితే ఏ సచివాలయం చూసినా అభ్యర్థులతో నిండిపోయింది. ఒకవైపు దరఖాస్తుల సమర్పణ, మరోవైపు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల కోసం కూడా బారులు తీరారు. దీంతో చాలా సచివాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తింది. మరికొన్ని సచివాలయాల్లో ప్రింటర్‌ సమస్యలు ఉన్నాయి.

Updated Date - Sep 08 , 2026 | 12:36 AM