Share News

ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:49 PM

చెవి నొప్పికి చికిత్స పొందేందుకు తాతతో కలిసి వెళ్తున్న యువకుడిని మృత్యువు కబళించింది.

ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు

  • రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): చెవి నొప్పికి చికిత్స పొందేందుకు తాతతో కలిసి వెళ్తున్న యువకుడిని మృత్యువు కబళించింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మన్నపాలెం దరి శ్రీకృష్ణానగర్‌ కాలనీకి చెందిన కలవానిపల్లి కల్యాణ్‌ (25) ప్రైవేట్‌ ఉద్యోగి. శనివారం ఉదయం చెవిలో నొప్పి ఎక్కువగా రావటంతో తన తాత ఏవీ శంకరరావుకు చెప్పాడు. దీంతో అగనంపూడిలో ఆసుపత్రికి తన ద్విచక్ర వాహనంపై శంకరరావు మనుమడిని తీసుకెళ్తున్నాడు. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళ్తున్న లారీ అగనంపూడి జంక్షన్‌కు సమీపంలో వెనుక నుంచి వీరి బైకును బలంగా ఢీకొట్టింది. శంకరరావు గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కల్యాణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో తొలుత అగనంపూడి ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వెద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కల్యాణ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌లో ఉంచారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం జాకేరు గ్రామానికి చెందిన కల్యాణ్‌ తల్లిదండ్రులు అంతకుముందే మృతి చెందటంతో కూర్మన్నపాలెం వచ్చి తాతతో ఉంటున్నాడు. ఈ ఏడాది కల్యాణ్‌కు వివాహం చేయాలని శంకరరావు భావించాడు. ఈ తరుణంలో కళ్ల ముందే తన మనుమడికి ఇలా జరగటంతో ఆ కుటుంబం కన్నీ రు మున్నీరుగా విలపిస్తోంది. కల్యాణ్‌ చిన్నాన్న రామచంద్రరావు ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:49 PM