Going Off Track... పక్కదారి పడుతున్నా.. పట్టదా?
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:27 AM
Going Off Track... Does Nobody Care? జిల్లాలోని పలు మండలాల్లో ఎరువులు పక్కదారి పడుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం.. కొంతమంది వ్యాపారులకు కలిసొ స్తుంది. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు.
వ్యాపారులకు కాసుల పంట
అధికారుల పర్యవేక్షణ లోపం
అంతంతమాత్రంగానే షాపులపై దాడులు
కేసులు నమోదు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మారని పరిస్థితి
ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులకు తప్పని అవస్థలు
పార్వతీపురం, జూన్24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో ఎరువులు పక్కదారి పడుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం.. కొంతమంది వ్యాపారులకు కలిసొ స్తుంది. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు చేసి.. కేసులు నమోదు చేస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. దీంతో ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాకు ఇప్పటివరకు 17,449 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయి. ఇందులో 4,190 మెట్రిక్ టన్నుల వరకు విక్రయించారు. మరో 13,259 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
నమోదైన కేసులు ఇలా..
ఎరువుల విక్రయాలు, సరుకు నిల్వ, రికార్డుల నమోదులో వ్యత్యాసం ఉండడంతో 2023 నుంచి ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశారు. మొత్తంగా 300 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో బలిజిపేట మండలంలోని ఓ ఎరువుల దుకాణంలో 19 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు సీజ్ చేశారు. అదే ఏడాదిలో గరుగుబిల్లి మండలం ఖడగ్గవలసలోని ఓ షాపులో 16 మెట్రిక్ టన్నులను స్వాధీనం చేస్తున్నారు. సాలూరు మండలం బాగువలసలోని ఒక దుకాణంలో 9 మెట్రిక్ టన్నులను సీజ్ చేశారు. 2024-25లో భామిని మండలంలో బత్తిలిలోని ఓ సీడ్స్ దుకాణంలో 46 మెట్రిక్ టన్నులు, గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలోని ఓ స్టోర్స్‌లో 64 మెట్రిక్ టన్నులు, కొమరాడ మండలంలో కల్లికోటలోని దుకాణంలో ఐదు మెట్రిక్ టన్నులు, సీతంపేట మండలంలోని రెండు దుకా ణాలపై దాడులు అధికారులు నిర్వహించి రెండు మెట్రిక్ టన్నులు ఎరువులను సీజ్ చేశారు. 2025-26లో పాలకొండలోని ఓ షాపులో ఆరు మె ట్రిక్ టన్నులు, మరిపివలసలో 12 మెట్రిక్ టన్నులు, మక్కువ మండలం శంబరలో 119 మెట్రిక్ టన్నులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఏటా ఖరీఫ్ సీజన్‌లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖాధి కారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ వారి దందాకు అడ్డూఅదుపు లేకుండాపోతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
పర్యవేక్షిస్తున్నాం..
ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలు జరిగేలా పర్యవేక్షిస్తున్నాం. ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి మండలంలో ఎరువుల దుకాణాలపై దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయాధికారులను ఆదేశించాం.
- భవానీ శంకర్, డీఏవో, పార్వతీపురం మన్యం