Share News

వైద్యం కోసం వెళ్తూ..

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:46 AM

వైద్యం చేయించుకునేందుకు బైక్‌పై వెళుతున్న వారిని వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.

వైద్యం కోసం వెళ్తూ..
మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్‌ఐ మహేష్‌

- రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

- వెనుక నుంచి బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

- పోరలిలో విషాదం

బొండపల్లి/దత్తిరాజేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వైద్యం చేయించుకునేందుకు బైక్‌పై వెళుతున్న వారిని వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గొట్లాం సమీపంలోని బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యు.మహేష్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ఎల్లయ్య (48) గత కొద్దికాలంగా పైల్స్‌తో బాధపడుతున్నాడు. వైద్యం కోసం అదే గ్రామానికి చెందిన అల్లుడు వరుస అయిన పిల్లా రామునాయుడు(33)తో కలిసి బైక్‌పై ఆదివారం ఉదయం 8 గంటలకు విజయనగరం బయలుదేరాడు. ఇద్దరూ బైక్‌పై విజయనగరం వెళుతుండగా గొట్లాం బైపాస్‌ రోడ్డు బ్రిడ్జికి సమీపంలో సాలూరు నుంచి విజయనగరం వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. రామునాయుడుకు భార్య సాయితోపాటు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న పాప లోక్షిత ఉంది. రాజమండ్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంక్రాంతి కోసం స్వగ్రామం వచ్చాడు. ఎల్లయ్యను భార్య విడిచిపెట్టడంతో గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఆసుపత్రి వద్ద, సంఘటనా స్థలం వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైస్‌ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్‌ కూడా చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


25BPL4.gif

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..

ప్రమాదం జరిగిన గొట్లాం బైపాస్‌ రోడ్డు ప్రాంతాన్ని ఎస్పీ ఎ.దామోదర్‌ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి పోలీసులకు తెలియజేశారు. ఆయన వెంట బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ జీఏవీ రమణ ఉన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:46 AM