Gogu... quite good. గోగు.. కాస్త బాగు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:26 AM
Gogu... quite good. ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గోగు పంట సాగులో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ వాణిజ్యపరమైన ఒడిదొడుకులు, బంగ్లాదేశ్ నుంచి జూట్ దిగుమతిపై ఆంక్షలు నెలకొనడంతో దేశీయంగా జనపనార ఉత్పత్తిపై అందరి దృష్టి పడింది. ఈ పరిణామాన్ని రైతులు కూడా స్వాగతిస్తున్నారు. పంట సాగు చేస్తే మంచి ధర వస్తుందని భావిస్తున్నారు.
గోగు.. కాస్త బాగు
పంట సాగుకు ఆశావహ పరిస్థితులు
బంగ్లాదేశ్ నుంచి జూట్ దిగుమతిపై ఆంక్షలు
గత ఏడాది కన్నా పెరిగిన విస్తీర్ణం
గోగు పంట సైజు నమోదుకు కొత్తగా భువన్ జంప్ యాప్
బొబ్బిలి, జూలై 29(ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గోగు పంట సాగులో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ వాణిజ్యపరమైన ఒడిదొడుకులు, బంగ్లాదేశ్ నుంచి జూట్ దిగుమతిపై ఆంక్షలు నెలకొనడంతో దేశీయంగా జనపనార ఉత్పత్తిపై అందరి దృష్టి పడింది. ఈ పరిణామాన్ని రైతులు కూడా స్వాగతిస్తున్నారు. పంట సాగు చేస్తే మంచి ధర వస్తుందని భావిస్తున్నారు. గోగు పంటను ప్రోత్సహించేందుకు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని రాయితీలు ఇస్తోంది. విత్తనాలతో పాటు నాణ్యమైన జనపనార ఉత్పత్తి కోసం సోనా పౌడర్‌ను ఉచితంగా సరఫరా చేస్తుంది. కూలీల సమస్య తీవ్రంగా ఉండడంతో గోగు పంట సాగు గణనీయంగా తగ్గిపోతోందని గుర్తించి ఆధునిక పనిముట్లను కూడా రైతులకు పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది.
- గోగు రైతులకు ఇప్పటికే ఉచితంగా సోనా పౌడర్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ పౌడర్‌ను గోగుఊరవేత సమయంలో వినియోగిస్తే నాణ్యతతో కూడిన దిగుబడులకు ఆస్కారం ఉంటుంది. నీటిలో ఊరిన గోగును వలిచేందుకు సులభంగా ఉంటుంది. అనుచితమైన బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది.
- గోగు పండించే గ్రామాలున్న మండలాల్లో ఉన్న రైతు సేవాకేంద్రాలలో జూట్ కమిషనరు పంపిన లేఖలను రైతుల అవగాహన కోసం అందజేస్తున్నారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-నేషనల్ జూట్ బోర్డు సంయుక్తంగా గోగు పండించే రైతులకు గోగు విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. కిలో విత్తనాలు సబ్సిడీపై 57 రూపాయలకు అందజేశారు. ఎకరాకు మూడు కిలోల చొప్పున గోగు విత్తనాలను పంపిణీ చేశారు. టోసా రకం విత్తనాలతో రైతులకు అధిక దిగుబడి, నాణ్యతతో కూడిన గోగు ఉత్పత్తి వస్తుంది.
- కొత్తరకాల జూట్ పంట సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో గోగు పంట సైజు, ఎదుగుదల తీరు తదితర అంశాల నమోదు కోసం జేసీఐ కొత్తగా భువన్ జంప్ యాప్‌ను తీసుకొచ్చింది. దీనిలో జూట్ పంట ప్రగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంది.
ధరలు ఇలా
ఈ సీజన్‌లో టీడీ -1 గ్రేడ్ రకం నుంచి టీడీ- 5 వరకు రా జూట్ క్వింటాలు ధర రూ.5325 నుంచి రూ.6,525గా నిర్ణయిస్తూ గత నెల 29న జేసీఐ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మెస్తా బీమిలి రకం ఓ-టాప్ రకం రూ.4325లు, ఎస్ మిడ్ రకం రూ,4,175, మిడిల్ జూట్ క్వింటాలు ధర రూ.4,050లు, బాటమ్ రకం రూ.3950లు, బి.బాటమ్ రకం రూ.3850, క్రాస్ బాటమ్ రకం రూ.3750గా జేసీఐ నిర్ణయించింది.
ఐ-కేర్ ప్రాజెక్టు ఫేజ్-2 అమలు
జేసీఐ, నేషనల్ జూట్‌బోర్డు, సీఆర్‌ఐజేఎఫ్‌లు సంయుక్తంగా జూట్ ఐ కేర్‌ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. సబ్సిడీపై సర్టిఫైడ్ విత్తనాలు అందించడం, రైతుల పొలంలో యాంత్రిక పద్ధతులలో శాస్ర్తీయ జనపనార ప్రదర్శన, సైకిల్ వీడర్ ఉపయోగించి కలుపుతీయడం, శ్రమ ఆదాతో హెక్టారుకు సాగు ఖర్చును 8 నుంచి పది వేల రూపాయలకు తగ్గించడం తదితర కార్యకలాపాల ద్వారా గోగుపంట సాగురైతులను విరివిగా ప్రోత్సహించేందుకు జేసీఐ చర్యలు తీసుకుంటోంది.
పెరిగిన గోగు విస్తీర్ణం
రామ్‌ప్రసాద్, అడిషనల్ జూనియర్ ఇన్‌స్పెక్టరు, జేసీఐ బొబ్బిలి
ఈ సీజన్‌లో బొబ్బిలి డీపీసీ పరిధిలో 300 కిలోల తోసా రకం గోగువిత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేశాం. తెర్లాం మండలం లోచర్ల, బాడంగి మండలం డొంకినవలస, బలిజిపేట, సీతానగరం మండలాల్లో బొబ్బిలి సమీప గ్రామాలలో పంపిణీ చేశాం. 670 హెక్లార్టలో గోగు సాగులో ఉంది. గత ఏడాది కన్నా దాదాపు ఇది రెట్టింపు విస్తీర్ణం. గత ఏడాది పదివేల క్వింటాళ్ల జూట్ ఉత్పత్తికాగా ఈ ఏడాది 25 వేల క్వింటాళ్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. కిలో జూట్ ధర వందరూపాయలుగా నిర్ణయించారు. రైతులను ప్రోత్సహించేందుకు రాయితీపై గోగు విత్తనాలు, సోనా పౌడర్‌ను, సీడ్ డ్రిల్లింగ్ మిషన్లు, సైకిల్ వీడర్స్‌ను రైతులకు సరఫరా చేస్తున్నాం. బలిజిపేట, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం, తెర్లాం, బాడంగి, రాజాం వంగర ప్రాంతాలలో మాత్రమే గోగు పంట సాగులో ఉంది.