Share News

‘ఉపాధి’కి వెళ్లి.. విగతజీవిగా మారి

ABN , Publish Date - May 15 , 2026 | 12:00 AM

ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ వేతనదారుడు వడ దెబ్బకు గురై విగతజీవిగా మారిన ఘటన మండలంలోని భాసూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

‘ఉపాధి’కి వెళ్లి.. విగతజీవిగా మారి
పుష్పనాథం (ఫైల్‌)

-వడదెబ్బతో వేతనదారుడి మృతి

- భాసూరులో ఘటన

పాలకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ వేతనదారుడు వడ దెబ్బకు గురై విగతజీవిగా మారిన ఘటన మండలంలోని భాసూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల మేరకు.. భాసూరుకు చెందిన కోమటి పుష్పనాథం (62)కు భార్య కళావతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పుష్పనాథం రిక్షా కార్మికుడిగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ముగ్గురు కుమార్తెలకు గాను ఇద్దరికి వివాహాలు చేశాడు. ఒక కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఇంటిలోనే ఉంటుంది. భార్య కళావతి రోజువారి కూలికి వెళ్లేది. ఈ క్రమంలో ఆరేళ్ల కిందట పుష్పనాథం పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుంచి ఇంటిలోనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నాడు. అయితే, తాను కూడా కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక సహాయకుడిగా ఉండాలనే ఆలోచనతో గత కొద్ది రోజులుగా అప్పుడప్పుడు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉపాధి పనులకు వెళ్లిన పుష్పనాథం ఉదయం 10.30 గంటల సమయంలో వడ దెబ్బకు గురయ్యాడు. దీంతో తోటి కూలీలు ఆయన్ను ఓ చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. పుష్పనాథం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధి హామీ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది సంతాపం తెలిపారు. పుష్పనాథం మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Updated Date - May 15 , 2026 | 12:00 AM