అన్నకు బదులుగా పార్టీకి వెళ్లి..
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:11 AM
సోదరుడికి బదులు పార్టీకి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంఘటన గుర్లలో విషాదాన్ని నింపింది. గుర్ల గ్రామానికి చెందిన కమిండి సూర్యచంద్ర(17) చంపావతి నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు.
చంపావతి నదిలో మునిగి తమ్ముడి మృతి
గుర్ల, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): సోదరుడికి బదులు పార్టీకి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంఘటన గుర్లలో విషాదాన్ని నింపింది. గుర్ల గ్రామానికి చెందిన కమిండి సూర్యచంద్ర(17) చంపావతి నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంఽధించి శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలివీ.. కమిండి గ్రామంలోని ఒకే వీధికి చెందిన 9 మంది యువకులు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతో గురువారం మధ్యాహ్నం యువకులు చంపావతి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ మద్యం తాగి... నీటిలో ఈత కొట్టారు. కొంతసేపటి తర్వాత సూర్యచంద్ర విగతజీవిగా నీటిలో తేలడంతో భయంతో కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు. మిగిలిన వారు అతన్ని చికిత్స కోసం గుర్ల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లిమర్ల సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వాస్తవానికి మృతుడి అన్న కేశవరావు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అతడు వేరే పనికి వెళ్లడంతో ఆయనకు బదులుగా సూర్యచంద్ర మిత్రులతో కలసి పార్టీకి వెళ్లాడు. అక్కడ మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లి కమిండి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.