Jagannath! జగన్నాథా.. జయం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:28 PM
Glory to Lord Jagannath! జిల్లావ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య తొలి రథయాత్ర సాగింది. పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
స్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు
పార్వతీపురంటౌన్/పాలకొండ/సాలూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య తొలి రథయాత్ర సాగింది. పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆపై మేళతాళాలతో స్వామి రథారోహణ తంతు చేపట్టారు. జిల్లాకేంద్రం పార్వతీపురంలో పాతబస్టాండ్ కూడలి నుంచి దుర్గాదేవి ఆలయం వీధిలోని గుండిచా మందిరం వరకు జగన్నాథుడి రథయాత్ర సాగింది. తొలుత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం లాగి అందర్నీ ఉత్సాహపరిచారు. మరోవైపు భక్తుల దర్శనార్థం పాలకొండ రోడ్డులోని ఫ్లై ఓవర్ సమీపంలో జగన్నాథ స్వామి ఆలయంలో ఈవో సూర్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాలూరు పట్టణంలో అనువంశిక ధర్మకర్త విక్రమ్‌చంద్రసన్యాసిరాజు (యువరాజు) ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం వరకు రథయాత్ర నిర్వహిం చారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 25 వరకు రథయాత్ర ఉత్సవాలు జరుగు తాయని, రొజుకోక అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. కాగా జగన్నాథుడి దర్శనానికి భక్తులు బారులుతీరారు. ప్రత్యేక క్యూలో భక్తులను రథంపైకి పంపిస్తూ స్వామి వారి దర్శన అవకాశం కల్పించారు.
పూరి తరహాలోనే ...
ఒడిశా రాష్ట్రం పూరి తరహాలోనే పాలకొండలో జగన్నాథుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ ప్రధాన అర్చకుడు మఠం విశ్వనాధ్‌దాస్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయంలో స్వామివారికి పూజా కార్య క్రమాలు, కైంకర్యాలు చేపట్టారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించి పులకించిపోయారు. గురువారం సాయంత్రం భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య రథంపైకి ఉత్సవ మూర్తులను వేంచేయించారు. అనంతరం గుండిచా మం దిరం వరకు రథం తరలించారు. కాగా రథాన్ని లాగేందుకు భక్తులు, యువత ఆసక్తి కనబరిచారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకన్నలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఈవో పరమేశ్వరి, ధర్మకర్త సభ్యులు పల్లా కొండలరావు, టీడీపీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.